● అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అధ్యక్షతన మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఎన్‌సీఓఆర్‌డీ (నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆన్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ అనేది ఒక్క పోలీసు శాఖకే పరిమితమైన అంశం కాదని, అన్ని శాఖలు బాధ్యతగా తీసుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోకి మత్తు పదార్థాలు ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు వాటి నిల్వ, పంపిణీ, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
● ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా మూలాలను గుర్తించి, అందులో భాగస్వాములైన వ్యక్తులు, ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని, పోర్టు ప్రాంతాల్లో కంటైనర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాల ద్వారా జరిగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అంతర్రాష్ట్ర అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యంగా విశాఖపట్నం మార్గాల్లో నిఘా పెంచాలని సూచించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన
మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములను చేయాలని, స్థానిక మీడియా సహకారంతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అదనపు ఎస్పీలు సీహెచ్ సౌజన్య, స్వరూపరాణి జిల్లాలో అమలు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


