పోర్టులో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక | - | Sakshi
Sakshi News home page

పోర్టులో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

ముత్తుకూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కృష్ణపట్నం పోర్టులో మంగళవారం రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తుఫాన్‌ హెచ్చరికలతో విద్యుత్‌ శాఖ అప్రమత్తం

● ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌

ఎస్‌ఈ సుధాకర్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఆక్వాన్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా విద్యుత్‌ శాఖ అప్రమతంగా ఉందని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ సుధాకర్‌ అన్నారు. నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎండీ శివశంకర్‌ ఆదేశాలతో జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేశామన్నారు. విద్యుత్‌ లైన్లపై పడే అవకాశమున్న చెట్లకొమ్మలను తొలగించినట్లు వెల్లడించారు. సరఫరాలో అంతరాయాలు కలిగిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిబ్బందితో ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. స్తంభాలు, జేసీబీలు, క్రేన్లు, వైర్లు, ఇన్సులేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఉండొద్దన్నారు. సరఫరాలో సమస్యలపై టోల్‌ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155333, మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 91333 31912కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈవెనింగ్‌ కోర్టులకు వ్యతిరేకంగా..

● బార్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ తీర్మానం

● నేడు కోర్టు విధులను

బహిష్కరించనున్న న్యాయవాదులు

నెల్లూరు(లీగల్‌): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవెనింగ్‌ కోర్టుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం కోర్టు విధులను బహిష్కరించాలని నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ అసోసియేషన్‌ అధ్యక్షుడు పులిమి అయ్యప్పరెడ్డి, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్‌, ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజ యాదవ్‌ తెలిపారు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో మంగళవారం కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కోర్టులు నిర్వహించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వారు పేర్కొన్నారు. ఈ నిరసనకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు.

డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 18, 24 తేదీల నుంచి నిర్వహించాల్సిన డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ వెంకట్రాయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో విడత సాధారణ ఎన్నికల నిర్వహణకు అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారన్నారు. అదేవిధంగా ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండటంతో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈనెల 18 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ మూడు, ఐదు, ఏడు సెమిస్టర్‌ పరీక్షలతోపాటు, 24 నుంచి నిర్వహించాల్సిన పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల మూడో సెమిస్టర్‌ పరీక్షలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా వేసినట్లు తెలిపారు.

డ్వామా సిబ్బందిపై చర్యలు

నెల్లూరు(పొగతోట): వీబీ జీ రామ్‌జీ పథకంలో శ్రామికుల సంఖ్య పెంచడంలో విఫలమైన డ్వామా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పీఆర్‌ కమిషనర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాపూరు, దుత్తలూరు, కోట మండలాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశించినట్లు సమాచారం. వర్షాలు, వ్యవసాయ పనులు అధికంగా ఉండటంతో పనులకు వచ్చే శ్రామికుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ కారణంతో చర్యలకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement