నెల్లూరు(అర్బన్): ఆర్‌అండ్‌బీ సర్కిల్ పరిధిలో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలున్నాయి. రెండు నెలల క్రితం మూడు జిల్లాల్లో పదేళ్లుగా సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న ముగ్గురికి జూనియర్ స్థాయికి రివర్షన్లు ఇస్తూ ఎస్‌ఈ ప్రసాద్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులు కోర్టును ఆశ్రయించగా, ఆ ఉత్తర్వులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తిరిగి వారికి సూపరింటెండెంట్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తాజాగా నెల్లూరు సర్కిల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభావతి తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా కన్నీటిపర్యంతమయ్యారు.
పదోన్నతి కోరడమే నేరమా?
ప్రభావతి సుమారు 15 ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పదోన్నతి జాబితాలో ఆమె పేరు మొదటి స్థానంలో ఉంది. దీంతో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని కోరుతూ ఎస్‌ఈకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మూడు నెలల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆమెకు తక్షణమే పదోన్నతి కల్పించాలని ఆదేశించారు. విధిలేని పరిస్థితుల్లో ఆగస్టు 31న ప్రభావతికి పదోన్నతి కల్పి స్తూ ఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
సీటు లేదు.. జీతం లేదు!
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి పదోన్నతి పొందడంపై అసంతృప్తితో ఉన్న అధికారులు తనకు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా సీటు కేటాయించలేదని, రెండు నెలలుగా జీతం బిల్లు కూడా పెట్టడం లేదని ప్రభావతి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఎస్‌ఈని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఇదే సమయంలో ఎస్‌ఈకి అనుకూలంగా ఉండే మరో జూనియర్ అసిస్టెంట్ తన వద్దే కూర్చోవాలని మౌఖికంగా ఆదేశించారని, జీతం కావాలంటే తననే అడగాలని చెప్పి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
జీతం బిల్లుపైనా వివాదం
జీతం బిల్లు పెట్టకపోతే కలెక్టర్‌ను ఆశ్రయిస్తానని ప్రభావతి ఎస్‌ఈకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈనెల 6న ఆమె జీతం బిల్లును ట్రెజరీకి పంపించారు. అయితే మరుసటి రోజు ఉదయానికే అది వెనక్కి వచ్చింది. సాధారణంగా ట్రెజరీలో బిల్లుల పరిశీలనకు పలు దశలుంటాయి. లోపాలుంటే సంబంధిత ఉద్యోగులకు సమాచారం ఇచ్చి సరిచేసుకునే అవకాశం కల్పిస్తారు. గుమస్తా నుంచి ఎస్‌టీఓ, అక్కడి నుంచి ఏటీఓ స్థాయికి వెళ్లాల్సిన బిల్లు ఒక్క రోజులోనే తిరస్కరణకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ట్రెజరీ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ జూనియర్ అసిస్టెంట్‌గా రివర్షన్
ప్రభావతిని తిరిగి జూనియర్ అసిస్టెంట్‌గా మారుస్తూ ఈనెల 11న ఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి కల్పించిన రెండు నెలలకే తిరిగి రివర్షన్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) పదవీ కాలంలో కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులు, పోస్టుల పేర్ల మార్పు, రివర్షన్లు తదితర మార్పులు చేపట్టకూడదని ఆర్థిక శాఖ ఈ నెల 9న సర్క్యులర్ మెమో జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడిన రెండు రోజులకే ప్రభావతికి రివర్షన్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలను కూడా లెక్క చేయలేదని విమర్శలున్నాయి.
ఇదంతా ఎందుకోసం?
పదోన్నతుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఓ జూనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఆ శాఖలో వినిపిస్తోంది. అయితే జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ప్రభావతి పోరాడి పదోన్నతి పొందడంతో ఆమైపె కొందరు కక్ష పెంచుకున్నారనే ఆరోపణలున్నాయి. పొదలకూరులో పనిచేస్తూ నెల్లూరు కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చిన మరో క్లర్క్ కూడా ఎస్‌ఈకి అనుకూలంగా వ్యవహరిస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిసింది.
ఎన్నో ఆరోపణలు
ఆర్‌అండ్‌బీలో ఉద్యోగుల వ్యవహారాలకు సంబంధించి మరికొన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు అనుకూలమైన వారిని సూపరింటెండెంట్లుగా నియమించేందుకు పదేళ్లుగా ఆ హోదాలో పనిచేస్తున్న వారికి సీనియర్ అసిస్టెంట్లుగా రివర్షన్లు ఇచ్చారనే విమర్శలున్నాయి. కారుణ్య నియామకాల విషయంలోనూ లంచాలు ఇవ్వలేదనే కారణంతో నియామకాలను ఆలస్యం చేస్తూ ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారని సమాచారం. రోస్టర్ రిజిస్టర్ చాలాకాలంగా అందుబాటులో లేదని, రోస్టర్ పాయింట్లు లేకుండానే నియామకాలు, పదోన్నతులు, రివర్షన్లు చేపడుతున్నారని ప్రచారం ఉంది. ఈ పరిణామాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆ శాఖ కొందరు ఉద్యోగులు కోరుతున్నారు.
ఆర్‌అండ్‌బీ సర్కిల్ కార్యాలయం
ప్రమోషన్ కోసం మూడు నెలల క్రితం రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభావతి (ఫైల్)
మహిళా ఉద్యోగికి వేధింపులు
పదోన్నతి ఇచ్చి రివర్షన్
సీటు కేటాయించలేదని,
జీతం నిలిపివేశారని ఆవేదన
సూపరింటెండెంట్లకు గతంలో
నిబంధనలకు విరుద్ధంగా రివర్షన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల బేఖాతరు
ఎస్‌ఈ తీరుపై వెల్లువెత్తుతున్న
ఆరోపణలు
రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) నెల్లూరు సర్కిల్ కార్యాలయం కక్షసాధింపులకు వేదికగా మారింది. తమకు అనుకూలమైన వారిని అందలం ఎక్కించేందుకు నిబంధనలను పక్కనపెడుతున్నారనే విమర్శలున్నాయి. కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఆ శాఖలో కొందరు ఆడిందే ఆటగా, పాటగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది.


