నెల్లూరు(వీఆర్సీ సెంటర్): మనుమడి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించిన ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు పంచాయతీ నక్కా గోపాల్ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నక్కా గోపాల్ నగర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న బానాల నరసమ్మ మంగళవారం రాత్రి తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న పెద్ద మనుమడు ప్రకాష్ ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బుధవారం ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రాక్టర్‌తో దుక్కులు దున్నుతుండగా..
● రోటోవేటర్ జారిపడి యువ రైతు దుర్మరణం
కలిగిరి: వ్యవసాయ పనుల్లో ఉపయోగించే ట్రాక్టర్ రోటోవేటర్ ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని నాగసముద్రం బీసీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన పల్లాపు పెద్ద తిరుపతయ్య కుమారుడు నవీన్ (26) పొలంలో ట్రాక్టర్‌తో దుక్కులు దున్నుతున్నాడు. ఈ క్రమంలో రోటోవేటర్‌కు మరమ్మతులకు గురైంది. దానికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా జారిపడి నవీన్‌పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. చేతికందివచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కలిగిరి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా బుధవారం కేసు నమోదు చేశారు.
ఆటోను ఢీకొట్టిన బైక్
● యువకుడి మృతి ● మరొకరికి తీవ్రగాయాలు
ముత్తుకూరు: మండలంలోని కోళ్లమిట్ట సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదాలనగర్‌కు చెందిన ఈగ శ్రీను (25) మోటార్‌బైక్‌పై కోళ్లమిట్ట నుంచి ముత్తుకూరు వైపు వస్తున్నాడు. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొన్న సునీల్ గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆటోలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.


