వీఎస్‌యూలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

వీఎస్‌యూలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం

Nov 19 2026 12:43 AM | Updated on Nov 19 2026 12:43 AM

● ఆ విభాగం తీరు మారదా?

● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న

కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌

● ఫిర్యాదులు వచ్చినా చర్యలు శూన్యం

● ఆగమేఘాలపై డిగ్రీ ఎగ్జామ్స్‌ వాయిదా

నెల్లూరు(టౌన్‌): విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితాల ప్రకటన, రీ వాల్యుయేషన్‌, మార్కుల నమోదులో అవకతవకలు, సర్టిఫికెట్ల జారీ వరకు పరీక్షల విభాగం అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా వారి వ్యవహారశైలిలో మార్పు రావడం లేదన్న చర్చ విద్యావర్గాల్లో సాగుతోంది. పరీక్షల విభాగంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా ప్రశ్నించే వారు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అంతా గందరగోళం

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈనెల 13వ తేదీన కమిషనర్‌ జారీ చేశారు. అయితే ఈ పరిణామాలను పట్టించుకోకుండా వీఎస్‌యూ పరీక్షల విభాగం అధికారులు ఈనెల 14వ తేదీన డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 18 నుంచి మూడో సెమిస్టర్‌, 19వ తేదీ నుంచి ఐదో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికితోడు పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలను కూడా ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్‌ జారీ చేశారు. అయితే బుధవారం అకస్మాత్తుగా డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. తిరిగి ఎప్పటి నుంచి పరీక్షలు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.

మండిపాటు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన మరుసటి రోజే హడావుడిగా డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల విధుల కోసం యూనివర్సిటీలోని అధ్యాపకులకు బాధ్యతలు అప్పగిస్తారనే విషయం తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగా చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదులెన్నో..

యూనివర్సిటీలోని పరీక్షల విభాగం అధికారులపై అనేక ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వర్సిటీలో పరీక్షల విభాగం అత్యంత కీలకమైనది. ఎగ్జామ్స్‌ నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు ప్రతి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఈ విభాగం అధికారుల పనితీరుపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement