నెల్లూరు(లీగల్): న్యాయ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయకుండా, మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా ఈవెనింగ్ కోర్టులు నడిపితే ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవాదుల నిరసన కార్యక్రమంలో అంకయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యప్పరెడ్డి, పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజ యాదవ్, సీనియర్ న్యాయవాదులు ఎం.బ్రహ్మం, బద్దెపూడి రవీంద్ర పాల్గొన్నారు.


