సోమశిల నిర్వాసితుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సోమశిల నిర్వాసితుల ధర్నా

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

నెల్లూరు(వేదాయపాళెం): సోమశిల ప్రాజెక్ట్‌ కోసం తమ విలువైన భూములను కోల్పోయామని.. ప్రభుత్యోద్యోగం దక్కుతుందనే ఆశతో జీవిస్తున్నామని.. ప్రస్తుత ప్రభుత్వంలో తమ ఆశలు ఆవిరవుతున్నాయని బాధితుడు గోపాలకృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో తమ ఇళ్లు, భూములు, తరతరాల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించిన వైఎస్సార్‌ కడప జిల్లా సిద్ధవటం, నందలూరు, గోపవరం, ఒంటిమిట్ట మండలాలకు చెందిన 105 గ్రామాల నిర్వాసితులు నగరంలోని సోమశిల సర్కిల్‌ కార్యాలయం ఎదుట ధర్నాను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ హామీ మేరకు తమకు ఉద్యోగావకాశాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. సర్కార్‌ రూపొందించిన జాబితాలో ముందు వరుసలో సీనియర్లుగా ఉన్న తమకు కాకుండా 14 మంది జూనియర్లకు ఉద్యోగాలను ఈ ఏడాది జూన్‌లో కల్పించారని, దీని వెనుకున్న కారణాలను తమకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. సీనియార్టీ ప్రాతిపదికన తమకు ఉద్యోగాలను కల్పించాలని సోమశిల ఈఎన్సీ, ఎస్‌ఈ, వైఎస్సార్‌ కడప కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకున్నా న్యాయం జరగలేదని వాపోయారు. జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కలిసేందుకు యత్నిస్తే, ఆయన అపాయింట్మెంట్‌ కూడా లభించలేదని తెలిపారు. సీనియార్టీ జాబితాలోని పలువురు వయోభారంలో ఇప్పటికే మరణించారని, మిగిలిన వారికి వయస్సు ఎక్కువవుతుండటంతో తీవ్ర ఆందోళనతో కాలాన్ని వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. తమ జిల్లా పర్యటనకు గతంలో వచ్చిన సమయంలో హామీని మంత్రి లోకేశ్‌ ఇచ్చారని, దీన్ని నిలబెట్టుకోవాలని కోరారు.

పెద్ద ఎత్తున నినాదాలు

ఎస్‌ఈకి వినతిపత్రమిచ్చేందుకు యత్నించినా, అనుమతిని తొలుత ఆయన ఇవ్వలేదు. పడిగాపులు కాసిన నిర్వాసితులు ఓ దశలో విసిగిపోయి కార్యాలయ బయట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొన్ని గంటల తర్వాత కొందర్ని ఎస్‌ఈ రామచంద్రమూర్తి తన చాంబర్‌లోకి పిలిపించి వినతిపత్రాన్ని స్వీకరించారు. చిన్నపరెడ్డి, రఘురామిరెడ్డి, అన్వర్‌, నాగేశ్వరరావు, కొండారెడ్డి, మల్లికార్జున, ప్రసాద్‌, వెంకటసాయితేజేష్‌, నరసింహులు, వీరాంజనేయులు, సుబ్బయ్య, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement