వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు హేయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు హేయం

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

● టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన నేతలకు పరామర్శ

నెల్లూరు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై టీడీపీ నాయకులు, గూండాలు దాడులు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ ఎన్నికల సందర్భంగా వరకవిపూడి, ముత్తుకూరు గ్రామాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో టీడీపీ నేతల చేతుల్లో గాయపడి నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ దినేష్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్త శ్రీనివాసులును శుక్రవారం కాకాణి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

అండగా ఉంటాం

కాకాణి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగితే కూటమి నేతలు ఓడిపోతారన్నారు. అందువల్ల భయంతో ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సిన టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారన్నారు. ఇది వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లి తమ పార్టీ ఏజెంట్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడుతుంటే పోలీసులు వారికి సహకరించడం మరింత బాధాకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన వారే అధికార పార్టీ నాయకులకు అండగా నిలవడం చట్టవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా చేస్తోందన్నారు. దాడులతో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూడటం అవివేకం అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతలు దౌర్జన్యాలు, రిగ్గింగ్‌ చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. ఇలా చేయడం పిరికి పందల చర్య అన్నారు. దాడులకు పాల్పడిన వారితోపాటు పోలీసులపై తక్షణమే ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అక్రమాలను ప్రశ్నించినందుకే..

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను ప్రశ్నించినందుకే దినేష్‌ను కొట్టారని కాకాణి అన్నారు. పోలీసులు అతడిని బయటకు తీసుకుని వస్తున్న క్రమంలో కూడా మరోదఫా దాడి జరిగిందన్నారు. దీంతో తీవ్ర గాయాలై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడన్నారు. అవసరమైతే చైన్నెకి తరలించి దినేష్‌కు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదన్నారు. ఓటేసి ఒకచోట కూర్చున్న సమయంలో పోలింగ్‌ ముగిసిన అనంతరం అతడిపై కుట్ర పూరితంగా దాడి చేయగా తలకు తీవ్రగాయాలై కుట్లు పడ్డాయన్నారు. తమ పార్టీకి చెందిన నాయకుడు ఇసనాక రమేష్‌ గతంలో సొసైటీ చైర్మన్‌గా, గ్రామ సర్పంచ్‌గా పని చేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇంటికెళ్లి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. బయట తిరిగితే కేసులు పెడతామని బెదిరించారన్నారు. ఇలా ప్రతిపక్షనాయకులను ఇళ్లకే పరిమితం చేసేలా అధికార పార్టీ నాయకులు కుట్ర పన్నారన్నారు. గాయపడిన తమపార్టీకి చెందిన కార్యకర్తలు అనేక మంది ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇళ్లకు చేరారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారన్నారు. పార్టీకోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్ని స్థాయిల్లో నిలిచి దెబ్బలు తింటూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి కార్యకర్త, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దాడులకు సంబంధించి వీడియోలు తీసి భద్రపరిచామని, పాల్పడిన వారు, చేయించిన వారు, చట్టాన్ని పక్కన బెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు అధికారులు ఎవరైనా సరే అలాంటి వారందరిపై భవిష్యత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement