● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వాకాడు: ‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నాయకులు చేస్తున్న హింసాత్మక దౌర్జాన్యాలు, అరాచకాలు, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. వాటిని తిప్పి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వాకాడులోని తన నివాసంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు అనేక ఇబ్బందులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు, అభ్యర్థులు ధైర్యంగా ఎదురొడ్డి ప్రజల పక్షాన నిలబడటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరికీ నేదురుమల్లి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం అభ్యర్థులను అపహరించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, వాటని తిప్పి కొట్టాలని సూచించారు. ఇన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎవరు లొంగవద్దని, ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఎన్నికల సమయంలో ఐక్యంగా చూడలేక భయపడిన టీడీపీ నేతలు వారిని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. తయ పార్టీ నేతలు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి ఎన్నికల సమయంలో వారిని దూరంగా ఉంచడం దుర్మార్గమన్నారు. ప్రజలకు మేలు చేసి ఉంటే ప్రజా తీర్పును ఎదుర్కోవడానికి టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ భలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. అందురూ ఐక్యంగా పనిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.


