ప్రజాస్వామ్యాన్ని పరరక్షించాల్సి ఖాకీ.. అధికార పార్టీ కక్షపూరిత రాజకీయ అస్త్రంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు గర్హనీయం. పచ్చ చొక్కాల తొడిగిన పోలీసులు టీడీపీ నేతల తొత్తులుగా మారి బరితెగించి నామినేషన్ల పర్వం నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు ప్రతిపక్ష అభ్యర్థులకు బెదిరింపులు.. కౌంటింగ్ ఏజెంట్ల నిర్బంధాలు.. పోలింగ్ కేంద్రాల్లో దాడులు.. రిగ్గింగ్‌కు సహకరించారనేది జగద్వితమే. అక్రమ కేసులతో రాజకీయ ప్రత్యర్థుల గొంతునొక్కే ప్రయత్నాలు పోలీస్ వ్యవస్థ నిష్పాక్షికతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరికొందరు అధికారులపై డబ్బుల బేరసారాలకు మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు ఖాకీ చొక్కాలు వదిలి పచ్చ ఖద్దర్ తొడిగారు. శాంతిభద్రతలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుతూ చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమ విధులను పక్కన పెట్టి పచ్చనేతల తొత్తులుగా మారారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు పోలీస్ అధికారులు రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాం గిరీ చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహరించారు. గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరులో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నేతల పాలేర్లుగా పనిచేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టంగా మార్చుకుని వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పుర, పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల కళ్లల్లో అనందం చూసేందుకు కొందరు పోలీస్ అధికారులు చూపిన అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ యావత్ ప్రజాక్షేత్రం ఛీదరించుకుంటుంది.
పచ్చ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా..
పుర, పరిషత్ ఎన్నికల్లో కొందరు పోలీస్ అధికారుల పాత్ర వెండి తెరపై విలన్ క్యారెక్టర్స్‌ను తలపిస్తున్నాయి. ఉదయగిరి మండలం బిజ్జంపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌కు పోలింగ్ జరుగుతున్న సమయంలో సీతారామపురం టీడీపీ నేత చింతం శ్రీనివాసులు, అతని అనుచరులు బూత్‌లోకి దూరి రిగ్గింగ్ చేసే ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ లాఠీఛార్జి చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగక ఉదయగిరి సీఐ అంకమ్మరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థితోపాటు దాదాపు 20 మందిని స్టేషన్‌లో నిర్బంధించి అక్రమ కేసు నమోదు చేశారు. శనివారం జరగబోయే కౌంటింగ్‌కు ఏజెంట్లుగా వెళ్లనివ్వకుండా చేసే ప్రయత్నంలోనే ఈ అక్రమ కేసు నమోదు చేశారు.
● వెంకటాచలంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ దినేష్‌పై టీడీపీ గూండాలు పోలింగ్ బూత్‌లోకి చొరబడి దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే మరోసారి టీడీపీ నేతలు బరితెగించి రక్తం కారేలా చితకబాదారు. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తుండగా అక్కడా చితక్కొట్టారు.
● పొదలకూరు మండలంలోని చెన్నారెడ్డిపాళెంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఐదు రోజుల పాటు నిర్బంధించి కనీసం ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా చేశారు.
● గూడూరులో పరిషత్ ఎన్నికల పోలింగ్ సమయంలో మంగళపూడి బూత్‌ను స్థానిక ఎమ్మెల్యే పీఏ ఆధ్వర్యంలో పచ్చ గూండాలతో కలిసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకు పోలీస్ ఉన్నతాధికారే సహకరించారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యను టార్గెట్ చేసి అతని నివాసం వద్ద పచ్చమూకలు, రౌడీలు హల్‌చల్ చేశారు.
టీడీపీ నేతల తొత్తులుగా మారి బరితెగింపు
పరిషత్ ఎన్నికల్లో ఖాకీలే రిగ్గింగ్‌లు
ఉదయగిరిలో కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థినే దిగ్బంధం చేసిన పోలీసులు
వెంకటాచలంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను చితక్కొట్టినా నో కేస్
తిక్కవరంలో ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్‌కు అవకాశం కల్పించిన ఎస్సై
మాజీ ఎమ్మెల్యేను నడిరోడ్డుపై అడ్డగించిన ఆత్మకూరు సీఐ
గూడూరులో డీఎస్పీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఇంటి వద్ద గూండాల హల్‌చల్
సురేష్‌బాబు. చిల్లకూరు ఎస్సై. ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మండలంలో ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నేతలను కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్‌కు పిలిపించి ఎవరూ కూడా నామినేషన్లు దాఖలు చేయొద్దని, తన మాట కాదని నామినేషన్ వేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగారు. మండలం 13 ఎంపీటీసీలు, ఒక జెడ్పీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ఎస్సై బెదిరింపులతో రెండు రోజులు ముందుకు రాలేకపోయారు. నాయకులు సైతం ఎస్సై చర్యలతో బెదిరిపోయారు. ఏరూరు, చింతవరం, ఉడాతావారిపాళెం ఎంపీటీసీలపాటు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు. దీంతో ఈ మూడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఏకగ్రీవం చేయడంలో ఎస్సై కీలకంగా వ్యవహరించారు. స్థానిక పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదులు చేయడంతో ఆమె ఆదేశాలతో చివరి రోజు మిగిలిన అభ్యర్థులు బిక్కుబిక్కుమంటూ వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో సైతం ఎస్సై కౌన్సెలింగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు.
సీహెచ్ సీతారామయ్య. నెల్లూరు చిన్నబజారు పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్. ఆయన మధ్యవర్తిత్వంతో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు 58వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి భర్త జమీర్‌తో వాట్సప్ కాల్ ద్వారా బేరసారాలకు యత్నించారు. పోటీ నుంచి తప్పుకుంటే రూ.70 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ చేశారు. డబ్బును ఇన్‌స్పెక్టర్ వాహనంలోనే పంపిస్తానని, 15 నిమిషాల్లో ఎక్కడికి కావాలో అక్కడికి చేరిపోతాయని చెప్పారు. ఇన్‌స్పెక్టర్ మరో అడుగు ముందుకు వేసి క్యాండిడేట్‌వి రెండు చెక్కులు తెప్పిస్తున్నా.. డబ్బులు ఇవ్వగానే వారి చెక్కులు వారికి ఇచ్చేయ్ అని జమీర్‌కు చెప్పారు. ఈ వ్యవహారం తాలుకా సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరలైంది.


