● ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే అక్రమ అరెస్టులు
● ధ్వజమెత్తిన మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: మండలంలోని బిజ్జంపల్లిలో గురువారం నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని టీడీపీ నేతలు ఆక్రమించి రిగ్గింగ్ చేసే యత్నాన్ని స్థానికులు, తమ పార్టీ నేతలు అడ్డుకున్నారని.. అయితే అధికార పార్టీ వారిని వదిలేసి తమ వారిపై అక్రమ కేసులను బనాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఉదయగిరిలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. నామినేషన్ల మొదలుకొని ఎన్నికల వరకు తమ పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. సీతారామపురం మండలంలో తమ పార్టీ అభ్యర్థులకు తెలియకుండానే నామినేషన్లను విత్‌డ్రా చేయించి, అన్ని ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించడంలో ఆర్వోలపై ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని ధ్వజమెత్తారు. దుత్తలూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో జరిగిన ఏకగ్రీవాల్లోనూ కూటమి నేతలు, పోలీసుల పాత్ర ఉందని చెప్పారు. బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడి, దౌర్జన్యం చేస్తున్నా.. ఖాకీలు ప్రేక్షకపాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని విమర్శించారు. బిజ్జంపల్లిలోని పోలింగ్ కేంద్రంలోకి సీతారామపురం మండలానికి చెందిన టీడీపీ నేత సుంకం శ్రీనివాసులు ప్రవేశించి రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే, దాన్ని అడ్డుకున్న తమ పార్టీ అభ్యర్థి కల్లూరి రవీంద్రరెడ్డితో పాటు మరో 25 మందిపై అక్రమ కేసులను బనాయించి వారు ఓట్ల లెక్కింపులో పాల్గొనకుండా పోలీస్‌స్టేషన్లో నిర్బంధించడం అన్యాయమన్నారు. దీనికి ఉదయగిరి సీఐతో పాటు సీతారామపురం, దుత్తలూరు ఎస్సైలు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామని ప్రకటించారు. బిజ్జంపల్లి, తిరుమలాపురంలో రిగ్గింగ్‌కు పాల్పడిన పచ్చ రౌడీలను వదిలేసి తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 2029లో జరగనున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారన్నారు. అనంతరం ఉదయగిరి సీఐ అంకమరావును యువనేత అభినవ్‌రెడ్డితో కలిసి.. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతలు దస్తగిరి అహ్మద్, షంషీర్, జబ్బార్, గాజులపల్లి రామిరెడ్డి, రోహిత్‌రెడ్డి, సలీం, సుభానీ తదితరులు పాల్గొన్నారు.


