చిల్లకూరు: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం పనుల నిర్వహణపై మండలంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ పథకంలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కూలీలకు పనులు కల్పించే విషయంలో స్థానికంగా ఉండే మేట్ల ద్వారా ఎక్కడ సులభంగా ఉంటుందో అక్కడ పనులు చేయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇటీవల ఇరిగేషన్ శాఖ నామినేషన్ పద్ధతిలో రూ.2.50 లక్షలతో చెరువుకట్ట పనులను ఓ కాంట్రాక్టర్‌తో చేయించి బిల్లులు చెల్లించింది. కాగా అదే ప్రాంతంలో వీబీజీ రామ్‌జీ ద్వారా గ్రామంలోని కూలీలతో పనులు పూర్తి చేసి కూలీలకు నగదు చెల్లించారు. క్షేత్రస్థాయి అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ చేపట్టిన పనుల వద్ద కూలీలతో పనులు చేయించకూడదనే విషయాన్ని గోప్యంగా ఉంచి ఏమీ తెలియనట్లుగా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఏం జరిగిందంటే..
తిమ్మనగారిపాళెం గ్రామంలో ఇటీవల మానెంగుంట అనే ప్రాంతంలో స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.2.50 లక్షలతో చెరువుకట్ట పనులు చేపట్టి తూతూమంత్రంగా పూర్తి చేశారు. వర్షాలకు ఆ పనులు కొంతమేర దెబ్బతినడంతో టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేశారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తున్నామని ప్రకటించారు. ఇరిగేషన్ శాఖ నిర్వహించిన కట్ట పనిని చేపట్టి దెబ్బతిన్న ప్రాంతాల్లో మట్టి పోసి చదును చేశారు. కాగా ఉపాధి పథకం పనుల నిర్వహణలో మూడు దశల్లో తనిఖీలు జరగాల్సి ఉంటుంది. తొలుత టెక్నికల్ అసిస్టెంట్ కూలీలు చేసిన పనులను పరిశీలించి కొలతలు తీసుకోవాలి. అనంతరం ఈసీ పరిశీలించి ఎంబుక్ సిద్ధం చేయాలి. చివరగా ఏపీఓ పనులను పరిశీలించి కూలీలకు నగదు చెల్లింపుల కోసం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే వీటి గురించి పట్టించుకోకుండా సిబ్బంది మొత్తంగా కుమ్మకై ్క కూలీలకు నగదు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. ఇరిగేషన్ శాఖ పనులు చేపట్టిన ప్రాంతంలోనే ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు గుర్తించలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించి, పనుల కొలతలను నిర్ధారించిన తర్వాతే చెల్లింపులు చేయాల్సి ఉండగా, ఈ వ్యవహారంలో వాటిని పాటించలేదనే ఆరోపణలున్నాయి.
కాంట్రాక్టర్‌తోనే పనులు చేయించాలి
ఇరిగేషన్ శాఖ చేపట్టిన చెరువు కట్ట పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే సంబంధిత కాంట్రాక్టర్‌తోనే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులే కాంట్రాక్టర్లుగా వ్యవహరించడంతో దెబ్బతిన్న పనులను ఉపాధి పథకం ద్వారా మళ్లీ చేయించారు. ఓవైపు ఇరిగేషన్ శాఖ ద్వారా కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించగా, మరోవైపు అదే ప్రాంతంలో పనులు చేసిన కూలీలకు ఉపాధి పథకం ద్వారా నగదు చెల్లించడం ప్రభుత్వ నిధుల వినియోగంపై అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, పనుల వివరాలు, కొలతలు, చెల్లింపులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇరిగేషన్ పనుల వద్దే ఉపాధి పనులు
నాసిరకంగా జరిగిన వాటికే మళ్లీ మరమ్మతులు
రెండు శాఖల ద్వారా చెల్లింపులు
తెలుగుదేశం నాయకుల నిర్వాకం
పనులు నిలిపివేశాం
ఇరిగేషన్ శాఖ పనులు చేపట్టిన ప్రాంతంలో ప్రస్తుతం పనులు నిలిపివేశాం. ఒక వారం మాత్రమే కూలీలకు నగదు చెల్లింపులు జరిగాయి.
– గిరిబాబు, ఏపీఓ


