విద్యావసతి వికాసానికి దాతల చేయూత | - | Sakshi
Sakshi News home page

విద్యావసతి వికాసానికి దాతల చేయూత

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

నెల్లూరు(రూరల్‌): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చేపట్టిన ‘విద్యావసతి వికాసం’ కార్యక్రమానికి దాతల నుంచి స్పందన లభిస్తోంది. ఎస్‌ఎన్‌జే గ్రూప్‌ చైర్మన్‌ జయమురుగన్‌ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హిమాన్షు శుక్లాను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. విరాళాలు అందించాలనుకున్న వారు జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శంకరయ్య, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగా నూనె గింజల విత్తనాల పంపిణీ

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచేందుకు, ఉత్పత్తికి అర్హులైన రైతులకు వేరుశనగ, నువ్వుల విత్తనాలను వందశాతం రాయితీపై అందజేయనున్నట్లుగా డీఏఓ పి.సత్యవాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ నూనె గింజల మిషన్‌ పథకం కింద రబీ సీజన్‌లో రెండు వాల్యూ చైన్‌ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేరుశనగ 500 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక క్లస్టర్‌గా, అదేవిధంగా నువ్వులు 200 హెక్టార్లను ఒక క్లస్టర్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ క్లస్టర్ల పరిధిలోని ఆసక్తిగల రైతులు తమ పరిధిలోని మండల వ్యవసాయాధికారిని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు నగరంలో

ట్రాఫిక్‌ ఆంక్షలు

నెల్లూరు(క్రైమ్‌): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం నెల్లూరు వైఎంసీఏ గ్రౌండ్స్‌లోని వీఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టినట్లు సౌత్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు. గాంధీబొమ్మ, ఎస్‌–2 సినిమా హాల్‌ రోడ్డు వైపు నుంచి వీఆర్సీ మీదుగా ఆర్టీసీ వైపు వెళ్లే వాహనాలను రామలింగాపురం అండర్‌ బ్రిడ్జి, ఆర్‌ఎల్‌ పురం జంక్షన్‌ మీదుగా మినీ బైపాస్‌ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే పోలీసు, ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల వాహనాల పార్కింగ్‌ కోసం వైఎంసీఏ గ్రౌండ్స్‌లో ప్రత్యేక స్థలం కేటాయించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.

హత్య కేసులో

నిందితుడికి జీవిత ఖైదు

గూడూరు: పాతకక్షల నేపథ్యంలో సొంత అన్నపై దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి శిక్ష పడింది. శుక్రవారం గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధించినట్లు ఏపీపీ వసంతకుమార్‌ తెలిపారు. గూడూరు కోర్టు ఆవరణలో ఆయన వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలం సంగనపల్లి గ్రామానికి చెందిన శనగ అంకయ్య, శనగ శ్రీరాములుకు పాత కక్షలున్నాయి. ఈ క్రమంలో శ్రీరాములు తన అన్న అంకయ్యపై 2017లో కర్రతో తలపై దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందడంతో డక్కిలి పోలీసులు విచారణ చేసి హత్యగా కేసు నమోదు చేశారు. శ్రీరాములును అరెస్ట్‌ చేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకట నాగపవన్‌ పైమేరకు తీర్పును వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల శిక్షను అనుభవించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కేసు విచారణలో వెంకటగిరి సీఐ, సిబ్బందితోపాటుగా కోర్టు లైజనింగ్‌ అధికారి మల్లికార్జున్‌, కోర్టు కానిస్టేబుల్‌ రామకృష్ణ సహకారం అందించారని ఏపీపీ తెలిపారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.70 సన్నవి : రూ.40

పండ్లు : రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement