నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని నెల్లూరు, నార్తురాజుపాళెం, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరుల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాగం చర్యలు చేపట్టింది. ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో 943 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు ఆరు కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరైనా ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు, కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
● నెల్లూరు వీఆర్ పీజీ స్టడీస్‌లోని కౌంటింగ్ కేంద్రం వద్ద నగర ఏఎస్పీ దీక్ష, నార్తురాజుపాళెంలోని జీవనజ్యోతి డిగ్రీ కళాశాల కేంద్రం వద్ద నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కావలిలోని పీబీఆర్ వీఈసీ ఇంజినీరింగ్ కళాశాలలోని కేంద్రం వద్ద స్థానిక డీఎస్పీ వీవీ రమణకుమార్, ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చరల్ డిగ్రీ కళాశాలలోని కేంద్రం వద్ద మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, ఆత్మకూరు గవర్నమెంట్ హైస్కూల్లోని కేంద్రం వద్ద స్థానిక డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు, గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద స్థానిక డీఎస్పీ కె.నరసింహమూర్తి శుక్రవారం బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
బాణసంచా దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): దీపావళి పండగ తరుణంలో ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బాణసంచా గోదాములు, శాశ్వత, తాత్కాలిక విక్రయ దుకాణాలను పోలీసు అధికారులు తనిఖీచేశారు. లైసెన్సులు, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ వైరింగ్, నీరు, ఇసుక అందుబాటులో ఉన్నాయా? లేదా? ఇలా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుమతుల్లేకుండా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిమితికి మించి బాణసంచాలు నిల్వలు చేయరాదని, అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ప్రమాదాలకు తావులేకుండా దీపావళి పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, హరిత టపాసులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కొనసాగింపు
● మండలాల వారీగా తేదీల ప్రకటన
నెల్లూరు(క్రైమ్): అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కార్యక్రమం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో శనివారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని సీఐడీ ఏఎస్పీ ఎస్.శిరీష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లోని అగ్రిగోల్డ్ బాధితుల కోసం తేదీల వారీగా పరిశీలన షెడ్యూల్‌ను ప్రకటించారు. 7వ తేదీన బోగోలు మండలం, 9న వింజమూరు, 10న ఆత్మకూరు, 11న అనంతసాగరం, 12న మర్రిపాడు, 13న సంగం, ఏఎస్‌పేట, 14న చేజర్ల, సైదాపురం, 16న కలువాయి, 17న నాయుడుపేట, 18 నుంచి 20 వరకు గూడూరు, 21న సూళ్లూరుపేట, 23న మనుబోలు, చిల్లకూరు, 24న వాకాడు, 25న కోట, 26న చిట్టమూరు, పెళ్లకూరు, 27న దొరవారిసత్రం, ఓజిలి, 28న రాపూరు, డక్కిలి, 30వ తేదీన వెంకటగిరి, బాలాయపల్లి మండలాల అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను పరిశీలించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని టాప్ క్లాస్ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో చదువుతున్న ఓబీసీ, ఈబీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం సంబంధిత విద్యాసంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీబీసీడబ్ల్యూఓ పి.వెంకటలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఈ ఉపకార వేతనాలకు సంబంధిత సంస్థ అధిపతి, నోడల్ ఆఫీసర్లు వెరిఫికేషన్ పూర్తి చేసి ఎన్‌ఎస్‌పీ పోర్టల్ ద్వారా ఈనెల 10 వతేదీ లోపు జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 92909 29699, 91823 94143 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


