● ఉదయం ఎనిమిది నుంచి ప్రారంభం
● స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల
బందోబస్తు
నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కౌంటింగ్ శనివారం ఉదయం ఎనిమిది నుంచి జరగనుంది. ఆరు స్ట్రాంగ్ రూమ్‌లలో 352 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. 386 మంది సూపర్వైజర్లు, 1158 మంది ఉద్యోగులను నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 8,53,540 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, పోలింగ్ 70.62 శాతంగా నమోదైంది. 30 జెడ్పీటీసీలకు 103 మంది.. 362 ఎంపీటీసీ స్థానాలకు గానూ 887 మంది బరిలో ఉన్నారు. ఐదు జెడ్పీ, 78 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెడ్పీ సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఓట్లను లెక్కించనుంది ఇక్కడే..
u నెల్లూరులోని వీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్‌లో నెల్లూరు రూరల్, తోటపల్లిగూడూరు, వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.
u గూడూరులోని ఎస్వీ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో సైదాపురం, రాపూరు, చిల్లకూరు, గూడూరు, కోట మండలాల కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు.
u కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో కలిగిరి, కావలి, వింజమూరు, కొండాపురం, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఓట్లను లెక్కించనున్నారు.
u ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల కౌంటింగ్‌ను చేపట్టనున్నారు.
u కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెం జీవనజ్యోతి జూనియర్ కళాశాలలో కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండలాల ఓట్లను లెక్కించనున్నారు.
u ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలువాయి, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఏఎస్‌పేట, చేజర్ల మండలాల ఓట్ల కౌంటింగ్‌ను జరపనున్నారు.


