గోపినాయక్‌ చరిత్ర అవినీతిమయం | - | Sakshi
Sakshi News home page

గోపినాయక్‌ చరిత్ర అవినీతిమయం

Sep 7 2026 12:09 AM | Updated on Sep 7 2026 12:09 AM

● గూడూరు రవాణా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఏఎంవీఐ రెండు నెలల క్రితం పరిమితికి మించి అధిక లోడు ఉందన్న కారణంగా ధాన్యం లారీకి సంబంధించిన వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు లంచం రూపంలో తీసుకున్నారు. ఈ విషయం లారీ అసోసియేషన్‌ నాయకులు దృష్టికి వెళ్లడంతో సదరు అధికారితో వాగ్వాదానికి దిగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక తీసుకున్న నగదును తిరిగి వెనక్కి ఇచ్చారు. సదరు అధికారితోపాటు మరో అధికారి కూడా గూడూరు సమీపంలో ఉన్న సంత రోడ్డుపైనే తనిఖీలు నిర్వహించి అక్కడి నుంచి వచ్చే వాహన యజమానుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఎంవీఐకి డీటీసీ గతంలో మెమో కూడా జారీ చేశారు. గూడూరు ఆర్టీఓ కూడా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు అధికారుల వ్యవహార శైలిపై డీటీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు.

నెల్లూరు (టౌన్‌): జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు అధిక లోడు వాహనాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధానంగా ఇసుక, గ్రావెల్‌, మట్టి, గ్రానైట్‌, క్వార్ట్‌ ్జ, ఫ్లైయాష్‌, ధాన్యం లారీలు అత్యధిక లోడుతో రవాణా చేస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఎంవీఐలు, ఏఎంవీఐలు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో నిత్యం తనిఖీల పేరిట అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా గూడూరులో పనిచేసే ఇద్దరు అధికారులు, నెల్లూరులో పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులు, స్క్వాడ్‌లో ఉండే అధికారులు ఈ తరహా తనిఖీలతో భారీగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల సమయంలో రవాణా అధికారి రోడ్డుపైన ఉండి ప్రభుత్వం కేటాయించిన హోంగార్డు లేదా అటెండర్‌ సహాయంతో వాహనాన్ని ఆపి రవాణా అవుతున్న సరుకుకు సంబంధించి వే బిల్లులు, ఆర్‌సీ, పర్మిట్‌, ఫిట్‌నెస్‌ తదితర వాటిని పరిశీలించాల్సి ఉంది. అయితే కొంత మంది రవాణా అధికారులు హోంగార్డు లేదా అటెండర్లను తనిఖీలకు తీసుకెళ్లకుండా ప్రైవేట్‌ వ్యక్తులను కారులో ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. సదరు అధికారి కారులోనే కూర్చొని ప్రైవేట్‌ వ్యక్తులతో వాహనాలను ఆపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో అధికారి అయితే నలుగురైదుగురు ప్రైవేట్‌ వ్యక్తులను తీసుకెళ్లి లారీ యజమానులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వసూలు

వాహన పరిమితికి మించి ఒక టన్ను అధికంగా ఉంటే తొలుత ఓనర్‌ ఫెనాల్టీ రూ.20 వేలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి టన్నుకు అదనంగా రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 టన్నులు ఓవర్‌లోడ్‌ ఉంటే ఓనర్‌ ఫెనాల్టీ రూ.20 వేలు, 10 టన్నులకు రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు చెల్లించాలి. దీంతో పాటు డ్రైవరు లైసెన్స్‌, ఆర్సీ, పర్మిట్‌, ఫిట్‌నెస్‌ లేకుంటే అదనంగా చెల్లించాలి. ఈ నిబంధనలు కొంత మంది రవాణా అధికారులకు వరంగా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తూ.. చిలక్కొట్టుడు కొడుతున్నారు. అధిక లోడు వాహనానికి లోడును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత మంది అధికారులు ప్రైవేట్‌ వ్యక్తుల అకౌంట్‌కు ఫోన్‌పే చేయిస్తుండగా, మరికొంత మంది నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రీతిలో కొందరు రవాణా అధికారులు ప్రతి రోజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు కలెక్షన్‌ రానిదే ఇంటికి వెళ్లరని ఆ శాఖలో పనిచేసే కొంత మంది రవాణా అఽధికారులే చెబుతున్నారు.

ధాన్యం లారీలను తనిఖీ

చేయొద్దని ఆదేశించినా..

జిల్లాలో తిరుగుతున్న ధాన్యం లారీలను ఆపి కేసులు నమోదు చేయొద్దని సాక్షాత్తు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొంత మంది రవాణా అధికారులు పెడ చెవిన పెట్టి ఆ లారీలనే టార్గెట్‌ చేస్తున్నారు. ధాన్యం లారీల్లో ఒకట్రెండు టన్నులు అధిక లోడు ఉన్నా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ధాన్యం లారీల నుంచి ప్రతి రోజూ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విషయంపై లారీ అసోసియేషన్‌ నాయకులు జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొంత మంది లారీ యజమానులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఏఎంవీఐలు కొంతమంది వివాదాస్పదంగా మారుతున్నారు. ప్రతి రోజు ఎక్కడోక ప్రాంతంలో లారీ యజమానులతో గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి.

అర్ధరాత్రి వేళ ఎంవీఐ గోపినాయక్‌ తనిఖీలపై ఏసీబీ దాడులు

రవాణా శాఖలో కొందరు అధికారులు 24/7 తనిఖీలతో కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వానికి పైసా పెనాల్టీ జమ కావడం లేదు. సదరు అధికారులు జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ప్రాంతాలు విభజించుకుని డ్యూటీలు చేస్తూ.. జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి తిమింగళాల దోపిడీ అప్రతిహతంగా జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క రవాణా వాహనానికి రేట్‌ ఫిక్స్‌ చేసి.. రైట్‌ రైట్‌ అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి ప్రభుత్వానికి జరిమానా రూపంలో ఆదాయం సమకూర్చాల్సిన కొంతమంది రవాణా అధికారులు.. అదే నిబంధనలను తమకు ‘కాసుల పంట’గా మార్చుకున్నారు. ఇసుక, గ్రావెల్‌, మట్టి, క్వార్ట్‌ ్జ, ఫ్లైయాష్‌, గ్రానైట్‌, ధాన్యం లారీలను టార్గెట్‌గా చేసుకుని పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా కావలి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీఐ గోపినాయక్‌ వద్ద భారీ మొత్తంలో అనధికారిక నగదు ఏసీబీకి పట్టుబడడం ఆ శాఖలో కలకలం రేపుతోంది.

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

రవాణా కార్యాలయంలో పని చేసే ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏఓలతోపాటు ప్రతి ఉద్యోగి వినియోదారుడికి జవాబుదారీగా ఉండాలి. తనిఖీల సమయంలో అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తే నేరుగా 9281607030 నంబరుకు ఫిర్యాదు చేయండి. రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సర్‌ప్రైజ్‌ చెకింగ్‌లు నిర్వహిస్తాను. అక్కడ వారు డబ్బులు తీసుకోవడం.. అనధికార సిబ్బంది ఉన్నట్లయితే అక్కడే చర్యలు తీసుకుంటాను. ఇటీవల కాలంలో జిల్లాలోని ఎంవీఐలు, ఏఎంవీఐలతో సమావేశం నిర్వహించి కమిషనర్‌ ఆదేశాలను వివరించాం.

– చందర్‌, డీటీసీ

రూ.2.48 లక్షల అనధికారిక నగదు పట్టుబడిన వైనం

పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీలు

ఇసుక, గ్రావెల్‌, క్వార్ట్‌ ్జ, మట్టి, ధాన్యం ఫ్లైయాష్‌, గ్రానైట్‌ లారీలే టార్గెట్‌

ఒక్కో వాహనానికి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వసూలు

అడిగినంత డబ్బులిస్తే రైట్‌రైట్‌,

లేకుంటే కేసు నమోదు

ఒక్కో అధికారి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వసూళ్లు

ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి

వాహనాల తనిఖీలు

ఫిర్యాదులు వస్తున్నా.. పట్టించుకోని రవాణా ఉన్నతాధికారులు

రవాణాశాఖ స్క్వాడ్‌లో మోటారు వాహనాల అధికారిగా పనిచేస్తున్న గోపినాయక్‌ చరిత్ర అవినీతి మయం. తాజాగా శనివారం అర్ధరాత్రి తర్వాత కావలి సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో భారీ మొత్తంలో అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదరు ఎంవీఐ కారు, జేబులను తనిఖీ చేయగా రూ.2.48 లక్షలు దొరికింది. గోపినాయక్‌ గతంలో సూళ్లూరుపేట ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ట్యాంకర్లను ఫిజికల్‌గా చెకింగ్‌ చేయకుండానే రీ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా నగదు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేసి నిజమని తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఏడాది తిరగక ముందే నెల్లూరు స్క్వాడ్‌లో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement