చంద్రబాబు అధికారంలో ఉంటే.. కరువే.. | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అధికారంలో ఉంటే.. కరువే..

Sep 8 2026 12:11 AM | Updated on Sep 8 2026 12:11 AM

శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 871 అడుగులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గ్రావిటీ 841 అడుగులు రాయలసీమ ఎత్తిపోతల గ్రావిటీ 800 అడుగులు రోజుకు నీటి తరలింపు అవకాశం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా – 4 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా – 3 టీఎంసీలు

కరువు.. చంద్రబాబు కవలలని అప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. జిల్లాను కరువు వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో గతేడాది అంతంత మాత్రంగా వర్షాలు కురిస్తే.. ఈ ఏడాది పూర్తిగా ముఖం చాటేశాయి. జిల్లాలోని జలాశయాలు అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో శ్రీశైలం జలాశయంలో తగింత స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కనీసం సాగు, తాగునీటి అవసరాలకు కూడా జిల్లా జలాశయాలకు నీటిని విడుదల చేయడంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం రైతులతో చలో నెల్లూరు బ్యారేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర వర్షాభావం తో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిలలో 78, కండలేరులో 69 టీఎంపీలు, ప్రధాన రిజర్వాయర్లు, మేజర్‌, మైనర్‌ చెరువుల్లో కలిసి మొత్తంగా 200 టీఎంసీల నీటి నిల్వలకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సోమశిలలో 17.1, కండలేరులో 18.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక మేజర్‌, మైనర్‌ చెరువులు సైతం పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో సమీప భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడి సైతం నెలకొనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అవకాశాలు ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు లెక్కిస్తే.. దాదాపు 38 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్‌ సాగు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సుమారు 6 టీఎంసీల నీటి అవసరం ఉందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. మిగిలిన 32 టీఎంసీల్లో సోమశిల డెడ్‌ స్టోరేజీ 8, కండలేరు డెడ్‌ స్టోరేజీ 6 టీఎంసీలతోపాటు చైన్నె తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుత వాతావరణం మండు వేసవిని తలపిస్తుండడంతో జలాశయాల్లో ఆవిరి శాతం కూడా అత్యధికంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం 6 టీఎంసీలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన 25 టీఎంసీలు పోను 7 టీఎంసీలు కూడా నిల్వ ఉండే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

శ్రీశైలం నుంచి నీటి విడుదలలో నిర్లక్ష్యం

రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల జలనిధి అయిన శ్రీశైలం (గరిష్ట నీటి మట్టం 885 అడుగులు)లో కూడా నీటి మట్టం పడిపోయింది. అదృష్టవశాత్తు కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద నీరు రావడంతో 871 అడుగుల (149 టీఎంసీలు) నీటి మట్టానికి చేరింది. ఈ తరుణంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులర్‌ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్‌ పంటలను కాపాడడంతోపాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా శ్రీశైలం జలాలను విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నా.. చంద్రబాబు కనీసం స్పందించడం లేదు. శ్రీశైలంలో 841 అడుగుల కంటే నీటి మట్టం పెరిగితే.. రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన రోజుకు కనీసం 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ గ్రావిటీ ద్వారా జిల్లాలోని జలాశయాలను నింపే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ సర్కారు 800 అడుగుల నీటి మట్టానికి పడిపోయినా.. శ్రీశైలం జలాలను తరలించుకుని పోతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయడం లేదు. శ్రీశైలంలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నప్పుడైనా జిల్లా జలాశయాలు నింపే ఆలోచన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేయకపోవడం జిల్లా రైతాంగం, ప్రజలు చేసుకున్న దురదృష్టం. ప్రస్తుత పరిణామాలతో జిల్లా రైతాంగం కన్నీరు పెడుతోంది.

రాయలసీమ ఎత్తిపోతల పూర్తయినా..

రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా.. తెలంగాణతో సమానంగా కాకపోయినా.. కొంత మేరకైనా నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించి కరువు వేళ సైతం సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్‌ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించుకోవచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా రోజుకు 4 టీఎంసీలు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో గ్రేటర్‌ రాయలసీమలోని ప్రాజెక్ట్‌లకు రోజుకు 7 టీఎంసీలు తరలించుకుంటే.. కరువును తరిమి కొట్టే అవకాశం ఉంది. దాదాపు 85 శాతానికి పైగా పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆపేయడంతో శ్రీశైలంలో జల హక్కులు ఉన్నా.. వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది.

వైఎస్సార్‌.. జలయజ్ఞంతో సస్యశ్యామలం

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలోనే దశాబ్దాలుగా కల్లలుగా మిగిలిపోయిన జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కేవలం 1,500 క్యూసెక్కుల కెపాసిటి కలిగి ఉండేది. దీన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా హెడ్‌ రెగ్యులేటర్‌తోపాటు, కాలువలను ఆధునికీకరించారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడం, అటవీశాఖ అనుమతులు చకచకా తీసుకుని 2007–08 నాటికి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచి సింహపురి రైతుల్లో హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్‌ కేవలం రెండేళ్లల్లోనే రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలను పెంచగలిగారు. చంద్రబాబు తొలుత తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండీ సోమశిలలో నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక్క టీఎంసీ కూడా పెంచలేకపోయారు.

జిల్లాలో నీటి నిల్వల సామర్థ్యం (టీఎంసీలు)

జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు

సోమశిలలో 17.1,

కండలేరులో 18.3 టీఎంసీలే

ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్‌కు 10 టీఎంసీలు అవసరం

చైన్నె తాగునీటికి, డెడ్‌ స్టోరేజీ, ఆవిరి కింద 25 టీఎంసీలు

సమీప భవిష్యత్‌లో

వర్షపు జాడలే లేవు

కమ్ముకుంటున్న కరువు పరిస్థితులు

శ్రీశైలంలో తగినంత నీటి మట్టం ఉన్నా.. చుక్క నీటిని వదలని వైనం

సీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినా.. జిల్లా సస్యశ్యామలం

చివరికి వచ్చిన ఖరీఫ్‌ సాగుకు

సాగునీటి సమస్య

సాగు, తాగునీటికి గడ్డు పరిస్థితులు

నేడు కాకాణి ఆధ్వర్యంలో

చలో నెల్లూరు బ్యారేజీ

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక..

వైఎస్సార్‌ హయాంలో 72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెరిగిన సోమశిలను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక.. సోమశిల ప్రాజెక్ట్‌లకు సంబంధించి పెండింగ్‌ అటవీభూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్‌ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌ హయాంలో శ్రీకారం చుట్టిన సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్‌ జగన్‌ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటిని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కరువు సీమలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల ప్రాజెక్ట్‌లతో సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పదిహేడేళ్ల్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేశాడు. ఫలితంగా ముక్కారు పంటలతో అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లాలో కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. 1996–2004 మధ్య అధికారంలో ఉండి జిల్లాలో ఇది తాను నిర్మించి ప్రజలకు అంకింత చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్‌ లేదంటే అతిశయోక్తి లేదు. జిల్లా జలనిధి సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు అయితే.. ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ముంపు గ్రామాల ప్రజలు, రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయడంతో ఆయన హయాంలో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. చంద్రబాబు ఆది నుంచి జల ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకి. జిల్లాలోని సోమశిల, నెల్లూరు, సంగం, స్వర్ణముఖి బ్యారేజ్‌లతోపాటు సోమశిల ఉత్తర కాలువ ప్రాజెక్ట్‌లు ఆయన పాలనకు దృష్టాంతంగా నిలుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement