లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయండి

Sep 8 2026 12:11 AM | Updated on Sep 8 2026 12:11 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి

నెల్లూరు (లీగల్‌): ఈ నెల 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఏ నరసింహమూర్తి కోరారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లోని న్యాయమూర్తులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ అధ్యక్షతన జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల పరిష్కారంపై సమీక్ష సమావేశాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ కోర్టుల్లోని పెండింగ్‌ కేసుల పరిష్కారంపై న్యాయమూర్తులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కక్షిదారులు రాజీ చేసుకునేలా చూసి అధిక కేసులను పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేయాలని కోరారు.

పీఎం విశ్వకర్మ రుణాల

మంజూరుకు ప్రత్యేక శిబిరాలు

నెల్లూరు(అర్బన్‌): పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు కెనరా బ్యాంకు, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని లీడ్‌ బ్యాంకు డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మణిశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయం, ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న చేతివృత్తిదారులు, కళాకారులు అవసరమైన ధ్రువీకరణపత్రాలతో శిబిరాలకు హాజరై రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

కొత్త పింఛన్లకు

దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం తెలిపారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, ఏఆర్టీ, డయాలసిస్‌, ట్రాన్స్‌ జెండర్‌, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోపు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఎంవీఐ గోపీనాయక్‌

సస్పెన్షన్‌

నెల్లూరు (టౌన్‌): కావలి సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద చెకింగ్‌ చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన రవాణాశాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎంవీఐ గోపీనాయక్‌ సస్పెండ్‌ అయ్యారు. ఈ మేరకు సోమవారం రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు చేసిన సర్‌ప్రైజ్‌ తనిఖీల్లో ఎంవీఐ గోపినాయక్‌ వద్ద రూ.2.48 లక్షలు అనధికార నగదును గుర్తించారు. ఆదివారం ఏసీబీ అధికారులు రేడియో మెసేజ్‌ ద్వారా రవాణాశాఖ ఉన్నతాధికారులకు వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో గోపినాయక్‌ను సస్పెండ్‌ చేశారు. ఎంవీఐతో పాటు పట్టుబడిన మరో ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుళ్లను ఆ ఆ శాఖకు సరెండర్‌ చేశారు.

రెండో సారి సస్పెండ్‌

ఎంవీఐగా పనిచేస్తున్న గోపీనాయక్‌ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రెండు సార్లు సస్పెండ్‌ అయ్యారు. ఆయన సూళ్లూరుపేటలో ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్లు ఫిజికల్‌గా లేకుండానే రీ రిజిస్ట్రేషన్‌ చేశారు. మొత్తం 70కు పైగా ట్యాంకర్లకు రీ రిజిస్ట్రేషన్‌ చేసి భారీ మొత్తంలో లంచం రూపంలో నగదును తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను 2022లో రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆయన మళ్లీ 2023 జనవరిలో జిల్లాలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారిగా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు.

ఏసీబీ అధికారుల విచారణ

చెకింగ్‌ చేస్తూ పట్టబడిన ఎంవీఐ గోపీనాయక్‌ను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు విచారించారు. రవాణాశాఖ డీటీసీ బి.చందర్‌తోపాటు ఎంవీఐ గోిపీనాయక్‌, ఎంవీఐ సంధ్య ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎంవీఐ గోిపీనాయక్‌ నుంచి అనధికార నగదు, చెకింగ్‌, విధులు, గతంలో సస్పెండ్‌ వివరాలు తదితరాలు అడిగినట్లు సమాచారం. ఎంవీఐ సంధ్య నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలిసింది. రవాణాశాఖ వివరాలను కూడా డీటీసీని అడిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement