పొదలకూరు : సాగునీటి నిర్వహణ సక్రమంగా లేకనే పంటలు ఎండిపోతూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పొదలకూరు, మరుపూరులో కాకాణి సోమవా రం పర్యటించారు. ఈ సందర్భంగాపొదలకూరులో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కలువాయి మండలంలో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనుపూరుపల్లి, నూకనపల్లి, వెదనపర్తి, వెరుబొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4వేల ఎకరాల్లో పంటలు సాగునీరందక ఎండిపోతున్నాయన్నారు. అక్కడి రైతులు పురుగుమందు డబ్బాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగునీటి పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సెంటు భూమి కూడా ఎండనివ్వమన్న మంత్రుల మాటలు నీటి మూటలుగా మిగిలాయని విమ ర్శించారు. సోమశిల–కండలేరు ఫ్లడ్‌ఫ్లో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందని, రైతులు పంటలు పండించుకుంటారని తెలిపారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీరు విడుదల చేయాలని గత పదిరోజులుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
నేడు రైతుల కోసం ఆందోళన
జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం నట్టేట ముంచిందని కాకాణి ధ్వజమెత్తారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయమంటే పట్టించుకోవడం లేదన్నారు. రెండు జలాశయాల్లో 8 టీఎంసీల వంతున నిల్వలు ఉండే అవకాశం ఉందన్నారు. సాగునీటి సంగతి అటుంచి తాగేందుకు కూడా జిల్లా ప్రజలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రైతుల హక్కులు కాపాడేందుకు వారితో కలిసి వైఎస్సార్‌సీపీ మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు బ్యారేజీ వద్ద శ్రీశైలం నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఒక పక్క జిల్లాలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని అడ్డగోలుగా తోడేస్తున్నా కూడా స్పందించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 27 నెలలుగా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని, ఇప్పుడు స్థానిక ఎన్నికల స్టంట్‌లో భాగంగానే దరఖాస్తులు స్వీకరిస్తోందని ఆరోపించారు. కాకాణి వెంట నాయకులు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, తెనాలి నిర్మలమ్మ, జీ.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌కే అంజాద్, ఎం సతీష్‌రెడ్డి, ప్రసాద్, వెంకీ ఉన్నారు.
కలువాయిలో నీరందక ఎండుతున్న పంటలు
రైతు సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం


