గూడూరు: టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ నాయకుడు పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడులకు బరితెగించారు. గూడూరులోని ధర్మరాజుస్వామి ఆలయానికి సంబంధించి భూములు, దుకాణాల వేలంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారుల అక్రమాలపై ఆ పార్టీ ఎస్సీ నేతగా ఉన్న పల్లె కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడంతో జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు కక్షపూరితంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోటేశ్వరరావు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ బయట ఉండి సోమవారం గూడూరుకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి టీడీపీ నాయకుల అరాచకాలపై ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు మండల పరిషత్ కార్యాలయంలో కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించేందుకు జీప్‌లో ఎక్కిస్తుండగా టీడీపీకి చెందిన కొందరు తమ నాయకుడిపైన ఇష్టానుసరంగా మాట్లాడతావా అంటూ పోలీసుల ఎదుటే కోటేశ్వరరావుపై భౌతికదాడికి యత్నించారు. ఆ తర్వాత అతన్ని పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకుని వెళ్లిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు, గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం ఉండే ప్రాంతానికి చెందిన మహిళలు, స్థానికులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులు నేరుగా స్టేషన్ ఆవరణలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న పోలీసులతో కోటేశ్వరరావును బయటకు వదలాలని పట్టుబట్టారు. పట్టణ, రూరల్ సీఐలు శేఖర్‌బాబు, కిషోర్‌బాబు వాగ్వాదానికి దిగిన వారిని సముదాస్తూ.. పేరు పేరునా పిలుస్తూ బయటకు వెళ్లాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారికి అరెస్టు చేసిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించాలనే విషయం తెలియజేయడం చూస్తుంటే అక్కడకు వెళ్లి దాడులకు పాల్పడండని ప్రేరేపించేలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులు సుమారుగా గంటకు పైగా స్టేషన్ ఆవరణలో ఉండడం, అధికార పార్టీకి చెందిన వారు కావడం, స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా పల్లి కోటేశ్వరరావు అరెస్ట్
● పోలీసుల వీరంగం
గూడూరురూరల్ : గూడూరు ఎంపీపీ ఛాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేత పల్లి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకునేందుకు ఒకటో పట్టణ సీఐ, ఎస్సై. పోలీసులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో గూడూరు సమన్వయకర్త గురవయ్య, న్యాయవాది రాఘవరెడ్డి, నాయకులు చెబుతున్నా పోలీసులు లెక్కచేయకుండా ఈడ్చుకెళ్లి జీపు ఎక్కించుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ధర్మరాజుస్వామి ఆలయంలో
అక్రమాలపై ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత
ఆ మరుసటి రోజే వైఎస్సార్‌సీపీలో చేరిక
వెంటనే అతనిపై కేసులు
నమోదు చేసిన వైనం
తాజాగా అరెస్ట్ చేస్తే పోలీసుల ఎదుటే పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడికి టీడీపీ శ్రేణుల యత్నం
బయటకు వదలాలని
పోలీసులతో వాగ్వాదం


