వెంకటాచలం: రోడ్డు దాటుతున్న లారీ క్లీనర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్ అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, క్లీనర్ గోపిరెడ్డి లారీలోని సరుకులను నెల్లూరులో అన్‌లోడ్ చేశారు. అనంతరం లారీని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నిలిపారు. 10.20 గంటల సమయంలో క్లీనర్ గోపిరెడ్డి(33) రోడ్డు దాటుతుండగా నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వేగంగా దూసుకొచ్చిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపిరెడ్డిని చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై మృతుని బంధువు వెంకటరామిరెడ్డి శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు డ్రైవర్ నిద్రమత్తు
● ముగ్గురికి గాయాలు
వెంకటాచలం: కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు– గొలగమూడి గ్రామాల మధ్య శనివారం జరిగింది. గొలగమూడిలో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తెతో కలిసి కారులో శుభ కార్యానికి శుక్రవారం కోట మండలం గూడలి గ్రామానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున తిరిగి గొలగమూడి వెళ్తుండగా తిక్కవరప్పాడు గ్రామం దాటగానే కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కాలినడకన వెళ్తున్న పట్రా సిద్ధయ్య, జయసుధ దంపతులను కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో పట్రా సిద్ధయ్య, జయసుధలకు గాయాలవ్వగా, కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న యువతికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
నెల్లూరు(క్రైమ్): శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకా బందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లు తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు జరిపారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 14 మందిపై, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఎంవీయాక్ట్ కింద 237 కేసులు నమోదు చేసి రూ.1,34,775ల జరిమానా విధించారు. బహిరంగ మద్య సేవనంపై 19 కేసులు నమోదు చేశారు. లాడ్జీలను తనిఖీ చేసి అందులో బసచేసిన వారి వివరాలను సేకరించారు.
లిఫ్ట్ నిర్వహణాలోపంతో వృద్ధుడి మృత్యువాత
కావలి: అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఓ వృద్ధుడు మరణించిన ఘటన కావలిలోని శాంతినగర్ కాలనీలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మల్లికార్జున అనే వ్యక్తి కావలిలోని శాంతినగర్‌లో ఉన్న సాయి అపార్ట్‌మెంట్‌లో గృహ ప్రవేశానికి పలువురిని పిలిచారు. జలదంకి మండలం హనుమకొండపాళేనికి చెందిన యానం రవీంద్ర(62)కు ఆహ్వానం అందింది. ఆయన శనివారం కావలిలోని అపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు. లిఫ్ట్‌ను ఆన్ చేయగా అది వచ్చి వెళ్లిపోయింది. వాస్తవానికి లిఫ్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాటి గ్రిల్స్‌కు ఉండే లాక్ తెరుచుకోవాలి. అయితే లిఫ్ట్ వచ్చి వెళ్లిన తర్వాత గ్రిల్స్ లాక్ కాకపోవడంతో వృద్ధుడికి తెలియకుండా ఓపెన్ చేసి వెళ్లిపోయారు. లిఫ్ట్ షాఫ్ట్‌లోకి జారిపడిన వృద్ధుడికి కింద ఉన్న ఇనుప రాడ్లు, స్ప్రింగ్స్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన ఆయన్ను తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


