గణేష్‌ ఉత్సవాలకు ‘సింగిల్‌ విండో’ అనుమతులు | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ ఉత్సవాలకు ‘సింగిల్‌ విండో’ అనుమతులు

Sep 6 2026 12:13 AM | Updated on Sep 6 2026 12:13 AM

ఇప్పటి వరకు 489 దరఖాస్తులు

నెల్లూరు(క్రైమ్‌): వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వం సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ శాఖల అనుమతుల ప్రక్రియను ఒకే వేదిక ద్వారా పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతేడాది జిల్లాలో 4,578 గణేష్‌ మండపాల ఏర్పాటుకు దరఖాస్తులొచ్చాయి. ఈ ఏడాది మండపాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 489 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తు ఇలా..

గణేష్‌ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా కమిటీగా ఏర్పడాలి. అనంతరం గణేష్‌ఉత్సవ్‌.నెట్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్వాహకుని పేరు, మొబైల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, చిరునామా, కమిటీ సభ్యుల వివరాలు, మండప ఏర్పాటు ప్రదేశం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, సంబంధిత పోలీస్‌స్టేషన్‌, సబ్‌డివిజన్‌ తదితర వివరాలను నమోదు చేయాలి. అదే విధంగా విగ్రహ నిమజ్జనం తేదీ, సమయం, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలు, ఏమార్గం గుండా వెళ్తారు.. తదితర వివరాలు దరఖాస్తులో పొందుపరిచి సబ్మిట్‌ చేయాలి. ఇది సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. పోలీసు అధికారులు మండపం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించి అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తారు

క్యూఆర్‌ కోడ్‌ ఉంచుకోవాలి

అనుమతి పొందిన ఉత్సవ నిర్వాహకులు వెబ్‌సైట్‌లోని అప్లికేషన్‌ స్టేటస్‌లో మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి ఎన్‌ఓసీతో పాటు పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూ ఆర్‌కోడ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దానిని ప్రింట్‌ తీసి మండపంలో అందుబాటులో ఉంచాలి. తనిఖీలకు వచ్చే పోలీస్‌, ఇతర శాఖల అధికారులకు చూపించే విధంగా భద్రపరుచుకోవాలి.

అనుమతులు తీసుకోవాలి

గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలి. పోలీసుశాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. – అజిత వేజెండ్ల, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement