● నిద్రిస్తున్న సమయంలో రాడ్డుతో కొట్టి మహిళ దారుణ హత్య
కోట: స్థానిక కోటమ్మగుడి కాలనీలో శుక్రవారం రాత్రి నాగభూషణమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురికాగా, శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, ఎస్సై పవన్‌కుమార్ వివరాల మేరకు.. కోటమ్మగుడి కాలనీలో ఆవుల నాగరాజు, యశోదమ్మ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. పందులు మేపుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి సమీప బంధువు అయిన ఏఎస్‌పేటకు చెందిన నాగభూషణమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో నాగరాజుకు నాగభూషణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను నాగరాజు చిల్లకూరు మండలం రామిరెడ్డిపాళెంలో ఉంచి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడు. దీనిని యశోదమ్మ జీర్ణించుకోలేకపోయింది. భర్త నాగరాజు పనిమీద ఓజిలికి వెళ్లిన క్రమంలో శుక్రవారం నాగభూషణమ్మను పని ఉందని చెప్పి యశోదమ్మ ఇంటికి పిలిపించుకుంది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత రాడ్డుతో నాగభూషణమ్మ తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారైనట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని గూడూరు సీఐ మాలకొండయ్య, ఎస్సై పవన్‌కుమార్ పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించాయి. హత్యకు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగభూషణమ్మ తల్లి రోశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


