SPSR Nellore: విజయుడు.. అందరివాడు | - | Sakshi
Sakshi News home page

SPSR Nellore: విజయుడు.. అందరివాడు

Mar 3 2024 12:10 AM | Updated on Mar 3 2024 9:24 AM

- - Sakshi

వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి

పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

సోషల్‌ మీడియా ద్వారా భారీగా మద్దతు

పారిశ్రామిక ప్రగతి, బిట్రగుంట రైల్వే అభివృద్ధికి ఆస్కారం

కావలి/బిట్రగుంట: నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి పేరును అధిష్టానం ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్టానం వూహ్యాత్మకంగా ఇచ్చిన షాక్‌తో జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ ఆశలను పూర్తిగా వదిలేసుకుంది. విజయసాయిరెడ్డి రాక జిల్లా అభివృద్ధికి మరింత మేలు చేకూరుస్తుందనే అభిప్రాయం పరిశీలకుల నుంచి సామాన్యుల వరకు వ్యక్తమవుతోంది.

ఎంపీగా గెలిపించుకుంటే మరిన్ని పరిశ్రమలు..
విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందనే భావన అందరిలో నెలకొంది. కేంద్రంతో సత్సంబంధాలున్న విజయసాయిరెడ్డి జిల్లా నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగిడితే.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన బిట్రగుంట రైల్వేకు సైతం పూర్వవైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని రైల్వే విశ్రాంత కార్మికులు, బిట్రగుంట వాసులు అభిప్రాయపడుతున్నారు.

సోషల్‌ మీడియాలో భారీగా మద్దతు
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించడంతో ఆయనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా విద్యావంతులు, యువత, వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు సైతం ఆయన్ను గెలిపించుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం విశేషం. విద్యావంతుడిగా, ఆర్థికవేత్తగా, రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో మంచిపట్టు ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీ మద్దతుదారులు సైతం విజయసాయిరెడ్డికి సంఘీభావం తెలుపుతూ లైక్‌లు, షేర్‌లు చేస్తుండటం విశేషం.

వివాదరహితుడిగా..
వివాదాల్లేని వ్యక్తిత్వం విజయసాయిరెడ్డికి సొంతం. సభలు, సమావేశాల్లో ఆవేశంగానో, అనాలోచితంగానో మాట్లాడకపోవడం.. ప్రతిపక్ష పార్టీలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయకుండా హుందాగా బదులివ్వడం.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ముఖ్యనేతల వరకూ అందర్నీ ఆప్యాయంగా పలకరించడం ఆయనలో ప్రత్యేకత.

పారిశ్రామికీకరణకు అనువుగా..
రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్ల నడుమ విస్తారంగా భూములున్నాయి. ప్రభుత్వ భూములు సుమారు రెండు వేల ఎకరాలు.. రైతులకు చెందిన భూములు పది వేల ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్నాయి. ఎగుమతులకు అనువైన పరిశ్రమల స్థాపనకు ఈ భూములు అనుకూలంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ తమ నివేదికల్లో పేర్కొంది. ఆ శాఖ ఉన్నతాధికారుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది.

పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను గుర్తించడం, రోడ్డు రవాణాతో పాటు సముద్ర మార్గంలో రవాణా, ఎయిర్‌ కార్గో ఎగుమతులు చేసేందుకు గల అంశాలపై అధ్యయనం చేసి సానుకూలత వ్యక్తం చేసింది. దాదాపు రెండు వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండి.. నిరుపయోగంగా ఉన్న బిట్రగుంటలో రైల్వేపరంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ యత్నాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదాలు, నిధులతోనే సాధ్యం. ఎంపీగా విజయసాయిరెడ్డి విజయం సాధిస్తే వీటన్నింటినీ సాధించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement