
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్‌లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 465 పరుగుల భారీస్కోరు చేసింది.
బౌలర్ల భరతం పట్టాడు
ఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా జట్టుకు తొలిసారి సారథ్యం వహిస్తున్న ముల్డర్ (Wiaan Mulder) వన్డేను తలపించే ఆట ఆడేశాడు. ఎదుర్కొన్న బంతులకంటే బాదిన పరుగులే ఎక్కువున్నాయి. బౌండరీలైతే మంచినీళ్ల ప్రాయంగా దంచేశాడు. జట్టు స్కోరు 11 వద్ద టోని డి జార్జి (10), 24 పరుగులకే సెనొక్వనే (3) ఇలా ఓపెనర్లు నిష్క్రమించిన వేళ... వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు.
ఇక బెడింగ్‌హామ్ (82; 7 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించిన ముల్డర్ రెండో సెషన్‌లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్‌లో ప్రిటోరియస్ (78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 217 పరుగులు జోడించాడు. దీంతో అఖరి సెషన్‌లో అతని డబుల్ సెంచరీ, జట్టు 400 పరుగుల మార్క్‌ను వేగంగా అందుకుంది.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముల్డర్, బ్రెవిస్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తనక చివంగకు 2 వికెట్లు దక్కగా, మతిగిము, మసకద్జా చెరో వికెట్ తీశారు. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో సఫారీ 328 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ముల్దర్
కెప్టెన్ హోదాలో ఆడిన తొలి టెస్టులో.. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 నాటౌట్) చేసిన ప్లేయర్‌గా వియాన్ ముల్డర్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా.. న్యూజిలాండ్ కెప్టెన్ గ్రాహమ్ డౌలింగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డును ఈ సందర్భంగా ముల్డర్ బద్దలు కొట్టాడు.
టెస్టు కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే
🏏వియాన్ ముల్డర్ (సౌతాఫ్రికా)- 2025లో బులవాయో వేదికగా జింబాబ్వేపై 264 రన్స్ నాటౌట్
🏏గ్రాహమ్ డౌలింగ్ (Graham Dowling- న్యూజిలాండ్)- 1968లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీమిండియాపై 239 రన్స్
🏏శివ్‌నరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్)- 2005లో జార్జ్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా మీద 203 రన్స్ నాటౌట్
🏏క్లెమ్ హిల్ (ఆస్ట్రేలియా)- 1910లో సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాపై 191 రన్స్
🏏జో రూట్ (ఇంగ్లండ్)- 2017లో లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాపై 190 రన్స్
🏏అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)- 2017లో చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌పై 173 రన్స్
🏏విజయ్ హజారే (ఇండియా)- 1954లో ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై 164 నాటౌట్
🏏క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్)- 1974లో బెంగళూరు వేదికగా టీమిండియాపై 163 రన్స్.
ముల్డర్.. మరిన్ని రికార్డులు
👉అదే విధంగా... టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా ముల్డర్ రికార్డు నెలకొల్పాడు. హెర్షల్ గిబ్స్ (228; 2003లో పాకిస్తాన్‌పై కేప్‌టౌన్‌లో) పేరిట ఉన్న రికార్డును ముల్డర్ సవరించాడు.
👉అంతేకాదు.. టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ముల్డర్ (264) ఘనత వహించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (309; 1930లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై), వీరేంద్ర సెహ్వాగ్ (284; 2009లో ముంబైలో శ్రీలంకపై), డాన్ బ్రాడ్‌మన్ (271; 1934లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
👉ఇక టెస్టు మ్యాచ్ తొలి రోజున దక్షిణాఫ్రికా చేసిన అత్యధిక స్కోరు (465) ఇదే కావడం విశేషం. 2003లో పాకిస్తాన్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 445 పరుగులు చేసింది.
క్లీన్ స్వీప్ లక్ష్యంగా..
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా.. రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో పర్యాటక ప్రొటిస్ జట్టు.. జింబాబ్వేను 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్