అందుకే లారా క్వాడ్రపుల్‌ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్‌ ముల్దర్‌ | ZIM VS SA 2nd Test: Wiaan Mulder Comments On Not Breaking Brian Lara Quadruple Century Record | Sakshi
Sakshi News home page

అందుకే లారా క్వాడ్రపుల్‌ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్‌ ముల్దర్‌

Jul 8 2025 7:43 AM | Updated on Jul 8 2025 10:11 AM

ZIM VS SA 2nd Test: Wiaan Mulder Comments On Not Breaking Brian Lara Quadruple Century Record

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ వియాన్‌ ముల్దర్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్‌ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.

విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్‌ స్కోర్‌ చేసిన ఆటగాడిగా..
సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా.. 
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా.. 
టెస్ట్‌ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..
టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా.. 
టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్‌ ఆమ్లా (311 నాటౌట్‌) ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.

ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్‌ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్‌ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్‌ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు విండీస్‌ దిగ్గజం​ బ్రియాన్‌ లారా మాత్రమే క్వాడ్రపుల్‌ సెంచరీ చేశాడు.

మ్యాచ్‌  రెండో రోజు తొలి సెషన్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్‌.. క్వాడ్రపుల్‌ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

టెస్ట్‌ క్రికెట్‌లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్‌ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్‌ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్‌ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.

తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్‌ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్‌ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఇన్నింగ్స్‌ అనంతరం వియాన్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్‌ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్‌ సెంచరీ చేసే అవకాశం​ వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్‌తో (దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. 

లంచ్‌ విరామం తర్వాత ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి మరో కారణం​ కూడా ఉంది. మ్యాచ్‌ గెలవడానికి సరిపడా స్కోర్‌ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

ముల్దర్‌ కామెంట్స్‌ విన్న తర్వాత యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అతనికి సెల్యూట్‌ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్‌ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్‌ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని  చూడలేమని జేజేలు పలుకుతుంది.

వియాన్‌ లారా క్వాడ్రపుల్‌ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక​ వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్‌), మాథ్యూ హేడెన్‌ (380), బ్రియాన్‌ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్‌ కంటే ముందున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్దర్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 82, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ 78, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 30, వెర్రిన్‌ 42 (నాటౌట్‌) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్‌ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్‌ (10-1-42-4), కోడి యూసఫ్‌ (7-1-20-2), కార్బిన్‌ బాష్‌ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్‌ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్‌ విలియమ్స్‌ (83 నాటౌట్‌) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్‌ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్‌ 51/1గా ఉంది. కైటానో (34), నిక్‌ వెల్చ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement