సెంచరీతో కదంతొక్కిన సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ | ZIM VS SA 1st Test: Wiaan Mulder Slams Century | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌

Jun 30 2025 5:07 PM | Updated on Jun 30 2025 5:32 PM

ZIM VS SA 1st Test: Wiaan Mulder Slams Century

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్దర్‌.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. మ్యాచ్‌ మూడో రోజు లంచ్‌ విరామానికి ముందు ముల్దర్‌ 149 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముల్దర్‌కు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. గతేడాది అక్టోబర్‌లో ముల్దర్‌ బంగ్లాదేశ్‌పై అజేయ శతకం బాదాడు.

ముల్దర్‌ ఇటీవలే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముల్దర్‌ తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు బ్రైడన్‌ కార్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌లో చేరాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ముల్దర్‌ను 75 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. ముల్దర్‌ ఐపీఎల్‌ 2025లో 2 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఓ ఓవర్‌ మాత్రమే వేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 415 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. వియాన్‌ ముల్దర్‌ 142, కైల్‌ వెర్రిన్‌ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్‌ తప్పించుకుంది. జింబాబ్వేను సీన్‌ విలియమ్స్‌ (137) అద్బుత సెంచరీతో గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన ముల్దర్‌ బంతితో కూడా రాణించాడు. 16 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. కేశవ్‌ మహారాజ్‌, కోడి యూసఫ్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153), కార్బిన్‌ బాష్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్‌ 17, బెడింగ్హమ్‌ 0, వెర్రిన్‌ 10, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ 21, కోడి యూసఫ్‌ 27, మఫాకా 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్‌ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement