చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ | ZIM VS SA 2ND TEST: WIAAN MULDER BECOMES THE FIRST CAPTAIN IN TEST HISTORY TO SCORE A TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ

Jul 7 2025 3:17 PM | Updated on Jul 7 2025 3:39 PM

ZIM VS SA 2ND TEST: WIAAN MULDER BECOMES THE FIRST CAPTAIN IN TEST HISTORY TO SCORE A TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్దర్‌ టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 297 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్‌.. టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. సెహ్వాగ్‌ 2008లో సౌతాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో టాప్‌-5 ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.

వీరేంద్ర సెహ్వాగ్‌-278 బంతుల్లో
వియాన్‌ ముల్దర్‌-297
హ్యారీ బ్రూక్‌-310
మాథ్యూ హేడెన్‌-262
వీరేంద్ర సెహ్వాగ్‌-364

ఈ ట్రిపుల్‌తో ముల్దర్‌ టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున టె‍స్ట్‌ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్‌ 314 పరుగుల స్కోర్‌ వద్ద హాషిమ్‌ ఆమ్లా (311 నాటౌట్‌) పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఆమ్లా తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్‌.. తొలి సెషన్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్‌ వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేస్తూ వేగంగా ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. కడపటి వార్తలు అందేసరికి ముల్దర్‌ 350 పరుగులు కూడా పూర్తి చేశాడు. 

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు (ముల్దర్‌తో కలిసి) మాత్రమే ఈ ఘనత సాధించారు. 108 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా స్కోర్‌ 593/5గా ఉంది. ముల్దర్‌ 350 (324 బంతుల్లో 48 ఫోర్లు, 3 సిక్సర్లు), వెర్రిన్‌ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 82, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ 78, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 30 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. 

తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేసిన ముల్దర్‌
జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ముల్దర్‌ తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన ముల్దర్‌ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన కేశవ్‌ మహారాజ్‌ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement