కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన మరో ప్లేయర్‌.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు | ZIM VS SA 2ND TEST: HUNDRED FOR WIAAN MULDER ON HIS CAPTAINCY DEBUT | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన మరో ప్లేయర్‌.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు

Jul 6 2025 6:51 PM | Updated on Jul 6 2025 7:45 PM

 ZIM VS SA 2ND TEST: HUNDRED FOR WIAAN MULDER ON HIS CAPTAINCY DEBUT

టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీసిన విషయం తెలిసిందే. లీడ్స్‌​ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. తాజాగా మరో ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి టెస్ట్‌ ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో చెలరేగాడు. వియాన్‌ ముల్దర్‌ సౌతాఫ్రికా కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్‌తో సత్తా చాటాడు. 

జింబాబ్వేతో ఇవాళ (జులై 6) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ముల్దర్‌ టీ విరామం సమయానికి 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టెస్ట్‌లో ముల్దర్‌ కేశవ్‌ మహారాజ్‌ సారథ్యంలో ఆటగాడిగా సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ముల్దర్‌ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. 

తొలి టెస్ట్‌ సందర్భంగా కేశవ్‌ మహారాజ్‌ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కింది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఇదివరకే తనను తాను నిరూపించుకున్న ముల్దర్‌కు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసే అవకాశం కూడా దక్కింది. 

27 ఏళ్ల ముల్దర్‌ 21 మ్యాచ్‌ల టెస్ట్‌ కెరీర్‌లో 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 31 సగటున 930 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 35 వికెట్లు పడగొట్టాడు. ముల్దర్‌ దక్షిణాఫ్రికా జట్టులో ఆల్‌ ఫార్మాట్‌ ఆటగాడిగా స్థిరపడ్డాడు. 25 వన్డేల్లో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 276 పరుగులు, 22 వికెట్లు.. 11 టీ20ల్లో 105 పరుగులు, 8 వికెట్లు తీశాడు. 

ముల్దర్‌ ఇటీవలే ఐపీఎల్‌ అరంగేట్రం కూడా చేశాడు. 2025 సీజన్‌లో అతను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఓ మ్యాచ్‌ ఆడాడు. ఇందులో 9 పరుగులు చేసి, వికెట్లేమీ తీయలేదు. ముల్దర్‌ ఇటీవల డబ్ల్యూటీసీ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 33 పరుగులు చేసి ఓ వికెట్‌ తీశాడు. 

ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. డబ్ల్యూటీసీ గెలిచిన జట్టులోని సీనియర్లకు విశ్రాంతినిచ్చి కేశవ్‌ మహారాజ్‌ను సారధిగా నియమించింది. ఈ సిరీస్లో సీనియర్లు​ లేకున్నా సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో అదిరిపోయే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు చెలరేగడంతో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 59 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. వియాన్‌ ముల్దర్‌ 154, తొలి టెస్ట్‌ సెంచరీ హీరో లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మరో ఆటగాడు డేవిడ్‌ బెడింగ్హమ్‌ (82) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టోని డి జోర్జి 10, అరంగేట్రం ఓపెనర్‌ లెసెగొ సెనోక్వానే 3 పరుగులకు ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 2, మసకద్జ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement