Ranji Trophy: జైస్వాల్ డకౌట్‌.. కేఎల్ రాహుల్ ఫ్లాఫ్‌ షో | Yashasvi Jaiswal-Duck-Out-KL Rahul Flop Show-Ranji Trophy-2026-27 | Sakshi
Sakshi News home page

Ranji Trophy: జైస్వాల్ డకౌట్‌.. కేఎల్ రాహుల్ ఫ్లాఫ్‌ షో

Oct 11 2026 11:27 AM | Updated on Oct 11 2026 11:36 AM

Yashasvi Jaiswal-Duck-Out-KL Rahul Flop Show-Ranji Trophy-2026-27

దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 92వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమయ్యింది. తొలి రోజే వివిధ జట్ల మధ్యన 19 మ్యాచ్‌లు మొదలయ్యాయి. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, కెప్టెన్‌ శుబ్‌మన్ గిల్‌, వాషిం‍గ్టన్ సుందర్‌, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగారు. కీలక టోర్నీకి ముందు వీరందరికీ మంచి ప్రాక్టీస్ లభించనుంది. 

కాగా టెస్టుల్లో భారత్‌కు కీలకమైన యశస్వి జైస్వాల్‌, కేఎల్ రాహుల్ తాజాగా తమ తొలి మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకేసారి విఫలమవ్వడం ఆందోళన కలిగించే విషయం. అయితే కివీస్ టూర్‌కు ముందు ఇండియా-ఎ జట్టు తరఫున కూడా అనధికారిక టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరు పాల్గొనే అవకాశముంది. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో వీరిద్దరు రాణిస్తారని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

జైస్వాల్ డకౌట్‌..
ముంబై తరఫున ఆడుతున్న జైస్వాల్‌.. ఎలైట్ గ్రూప్‌-డిలో చండీగఢ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ సిద్దేశ్ లాడ్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. దీంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైస్వాల్ 13 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఔటయ్యాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన జగ్జీత్‌సింగ్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.

కష్టాల్లో కర్ణాటక..
ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అజేయ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ రంజీల్లో కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. ఎలైట్ గ్రూప్‌-బిలో ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ కర్ణాటక ఓపెనర్  4 పరుగులు మాత్రమే చేసి శశికాంత్ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు.

19 ఓవర్లు ముగిసేసరికి కర్ణాటక 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, సుందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడుతో రాజస్తాన్ మ్యాచ్ ఆడుతోంది.

ఇదీ చ‌ద‌వండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement