ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ లీజెల్లి లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెకు జరిమానా పడింది. అంతేకాదు లీజెల్లి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ కూడా చేరింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MIW vs DCW) మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. వడోదర వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది.
నట్ సీవర్, హర్మన్ మెరుపులు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నట్ సీవర్- బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur- 33 బంతుల్లో 41) రాణించడంతో ఈ మేర స్కోరు సాధ్యమైంది.
లీజెల్లి లీ ధనాధన్
ఢిల్లీ బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజానే కాప్, నందిని శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (29) ఫర్వాలేదనిపించగా.. లీజెల్లి లీ ధనాధన్ దంచికొట్టింది. 28 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 46 పరుగులు చేసింది.
అయితే, అర్ధ శతకానికి చేరువైన వేళ లీ పొరపాటుతో మూల్యం చెల్లించుకుంది. అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి లీ విఫలం కాగా.. వికెట్ కీపర్ రాహిలా ఫిర్దోజ్ చక్కటి స్టంపౌట్‌తో ఆమెను పెవిలియన్‌కు పంపింది. రివ్యూలోనూ లీజెల్లి లీదే తప్పని తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె బ్యాట్‌ను కొట్టినట్లు కనిపించింది.
జరిమానా, డీమెరిట్ పాయింట్
ఈ నేపథ్యంలో లీజెల్లి లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు డబ్ల్యూపీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం.. లీ లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. క్రికెట్ పరికరాలను డ్యామేజ్ చేసే రీతిలో వ్యవహరించినందుకు గానూ ఈ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయి.
లెవల్ 1 తప్పిదం కాబట్టి లీ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని డబ్ల్యూపీఎల్ పేర్కొంది.
గెలిపించిన జెమీమా
ఇక ఈ మ్యాచ్‌లో లీతో పాటు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్) దంచికొట్టడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరింది. 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 155 పరుగులు చేసి.. ముంబైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇది రెండో విజయం కాగా.. ముంబై ఆరింట రెండు మాత్రమే గెలిచి నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగక ఐదింటికి ఐదు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్


