
Photo Courtesy: BCCI/IPL
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్‌లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.
చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీ
అదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆయుశ్ కూడా అదరగొట్టాడు
మరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.
ఒత్తిడికి లోనుకావద్దు
ఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్‌కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.
అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!
కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.
అందుకు ఓటమి
ఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.
ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు
👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ
👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్
👉చెన్నై స్కోరు: 187/8 (20)
👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)
👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.
చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025