
ఆయుశ్- వైభవ్ (Photo Courtesy: BCCI)
ఐపీఎల్-2025 (IPL 2025)లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)తో పాటు వెలుగులోకి వచ్చిన మరో యువ సంచలనం ఆయుశ్ మాత్రే (Ayush Mhatre). వైభవ్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగితే.. ఆయుశ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నారు.
అయితే, ఈ ఇద్దరూ ఆయా జట్ల కెప్టెన్లు గాయం కారణంగా దూరం కావడంతో తుదిజట్టులోకి రావడం సహా ఇద్దరూ ఓపెనర్లే కావడం విశేషం. వైభవ్ రాజస్తాన్ సారథి సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తే.. ఆయుశ్ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు బదులు బ్యాట్ ఝులిపిస్తున్నాడు.
ఇద్దరూ ఇ ద్దరే..
ఇక వైభవ్ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా అద్భుత శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. భారత్ తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
మరోవైపు.. ఆయుశ్ మాత్రే సైతం వైభవ్ మాదిరే అరంగేట్ర మ్యాచ్‌లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ వంటి పటిష్ట జట్టుపై 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మాత్రం ఆయుశ్ దుమ్ములేపాడు.
ఆర్సీబీ విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయుశ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ 17 ఏళ్ల టీనేజర్.
ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఆర్సీబీ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఆయుశ్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశాడని అతడి తండ్రి యోగేశ్ మాత్రే తెలిపాడు. అదే విధంగా ఆయుశ్‌ను వైభవ్‌తో పోల్చుకోవద్దని తాను సలహా ఇచ్చినట్లు వెల్లడించాడు.
సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!
ఈ మేరకు మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్.. నువ్వూ వేర్వేరు రకమైన బ్యాటర్లు అని ఆయుశ్‌కు చెప్పాను. ఎవరైనా నిన్ను వైభవ్‌తో పోలిస్తే పట్టించుకోవద్దనన్నాను.
అంతేకాదు వైభవ్‌ను అనుకరించకూడదని కూడా చెప్పాను. అతడిలా సెంచరీ చేయాలనే తొందరపాటు కూడా వద్దన్నాను. ఎందుకంటే ఆయుశ్ కూడా ఇంకా చిన్నవాడే. ఇప్పుడే తనపై పోలికలతో భారం పడి.. వాడు ఒత్తిడికి లోనుకావడం నాకు ఇష్టం లేదు. తను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
ధోని చెప్పిందిదే
ఇక ఆర్సీబీపై ఆయుశ్ ఇన్నింగ్స్ తర్వాత దిగ్గజ క్రికెటర్ ధోని. ‘బాగా ఆడావు చాంపియన్’ అని ప్రశంసించారు. నిజానికి జట్టును గెలిపించలేకపోయానని ఆయుశ్ బాధపడ్డాడు. అయితే, ధోని వచ్చి వెన్నుతట్టిన తర్వాత వాడు ఎంతగానో సంబర పడిపోయాడు.
‘బాగా బ్యాటింగ్ చేశావు.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆడాలి’ అని ధోని చెప్పారంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ధోని చెప్పినవి రెండు మాటలే అయినా ఆయన ప్రభావం మాత్రం ఎంతగానో ఉంటుంది. ఆయుశ్‌కు ఇష్టమైన, తను ఆరాధించే క్రికెటర్ నుంచి మెచ్చుకోలు మర్చిపోలేనిది’’ అని ఆయుశ్ తండ్రి యోగేశ్ మాత్రే చెప్పుకొచ్చాడు.
చదవండి: కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు..