
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్థాయికి తగ్గట్లు ఆకట్టులేకపోతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్.
ఇక రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా దూరం కావడంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని.. సీఎస్‌కేను మునుపటి విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది సీఎస్‌కే.
అంతేకాదు.. ఆడిన పదమూడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి తమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే దుస్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ధోనిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.
నా వల్ల కాదు.. అని చెప్పి వెళ్లిపో
‘‘ధోని వయసు పెరుగుతోంది. కాబట్టి ఆటగాడిగా అతడి నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. అయితే, ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటోంది.
ఒకవేళ నీకు హిట్టింగ్ ఆడటం కుదరకపోతే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును వీడిపోతే మంచిది. ధోని ఇలా చేయడమే మంచిది. ఒకవేళ అతడు ఇంకా ఇంకా కొనసాగుతూ... ఉంటే జట్టులో ఏ పాత్ర పోషిస్తాడు?
మోకాలి నొప్పులు కూడా
కెప్టెన్‌గా ఉంటాడా? వికెట్ కీపరా లేదంటా ఫినిషర్‌గానా?.. నిజాయితీ చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయింది. అతడిని మోకాలి నొప్పులు వేధిస్తున్నాయి. ఇకనైనా ధోని తప్పుకొంటే మంచిది’’ అని చిక్కా.. తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు.
రాజస్తాన్ ధనాధన్
ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దంచికొట్టిన రాజస్తాన్.. 17.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57), సంజూ శాంసన్ (31 బంతుల్లో 41), ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.
కాగా ఐపీఎల్‌లో సీఎస్‌కేను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. కానీ ఈసారి మాత్రం అతడికి సారథిగా ఘోర పరాభవం ఎదురైంది.
చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?.. సమీకరణలు ఇలా..
Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025