
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తొలి మూడు స్థానాలను ఆక్రమించి టాప్-4కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన మరొక్క బెర్తు కోసం ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) పోటీపడుతున్నాయి.
ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖడే మైదానంలో బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఫలితంగా.. ఢిల్లీ గనుక ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మాత్రం తప్పక ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సిందే. అయితే, ‘క్వార్టర్ ఫైనల్’ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
వర్షం ముప్పు..
ఆక్యూమీటర్ నివేదిక ప్రకారం.. రానున్న నాలుగు రోజుల్లో ముంబైలో వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యెల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. వాన పడేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నట్లు ఆక్యూమీటర్ వెదర్ రిపోర్టు వెల్లడించింది.
అయితే, రాత్రి వేళ ఇందుకు కేవలం 25 శాతం మాత్రమే ఆస్కారం ఉందని పేర్కొంది. కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదని.. ఈ నాలుగు రోజుల్లో కచ్చితంగా వర్షం పడే అవకాశం తప్పక ఉందని తెలిపింది.
మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?
ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం పడి.. మ్యాచ్ రద్దైతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. వరుణుడి కారణంగా మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. నిబంధనల ప్రకారం ముంబై- ఢిల్లీ జట్లకు చెరో పాయింట్ వస్తుందన్న విషయం తెలిసిందే. తద్వారా ఇక ఇప్పటికే పన్నెండింట ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది.
మరోవైపు.. పన్నెండింట ఆరు గెలిచి.. ఒకటి వర్షం వల్ల రద్దైన కారణంగా పదమూడు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఖాతాలో మొత్తంగా పద్నాలుగు పాయింట్లు చేరతాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ముంబై, ఢిల్లీలకు లీగ్ దశలో చెరో మ్యాచ్ మిగులుతాయి.
అయితే, ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తోనే తలపడనున్నాయి. మే 24న ఢిల్లీ, మే 26న ముంబై పంజాబ్ జట్టును ఢీకొడతాయి. ఒకవేళ బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే.. ఢిల్లీ పంజాబ్‌పై తప్పక గెలవాలి. అప్పుడు అక్షర్ సేన ఖాతాలో పదహారు పాయింట్లు చేరతాయి.
అయితే, పంజాబ్‌పై గెలవడంతో పాటు.. ముంబై పంజాబ్ చేతిలో ఓడితేనే ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పంజాబ్ చేతిలో ముందుగానే ఓడినా.. లేదంటే పంజాబ్‌పై ముంబై గెలిచినా అక్షర్ సేన కథ కంచికే! ఎలా చూసుకున్నా ముంబైతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్‌కే కెప్టెన్ రియాక్షన్ వైరల్