
Photo Courtesy: BCCI/IPL
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్‌లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సీఎస్‌కేతో మంగళవారం తలపడింది.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్‌వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు.
ఆరంభంలో కుదేలైనా...
చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
వైభవ్ ధనాధన్
లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది.
మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీ
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు
𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊
This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025