
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో విఫలమై అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.
తమ చెత్త ఆట తీరుతో మిగితా జట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పరిమితమైంది.
18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో పదివ స్దానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ సీజన్‌లో కూడా సీఎస్‌కే ఆఖరి స్దానానికి పరిమితం కాలేదు. ఐదు సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నైకు నిజంగా ఇది ఘోర పరాభావమే అని చెప్పాలి.
కాగా ఈ ఏడాది సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి గుజరాత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. . సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: ఇంకా ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు ఆడట్లేదు?