చరిత్ర సృష్టించిన వైభవ్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా.. | Vaibhav Suryavanshi Creates History 1st Player To Remarkable Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన వైభవ్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..

May 21 2025 9:27 AM | Updated on May 21 2025 10:11 AM

Vaibhav Suryavanshi Creates History 1st Player To Remarkable Feat

Photo Courtesy: BCCI/IPL

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఓ సీజన్‌లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన వైభవ్‌ సూర్యవంశీని రాజస్తాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.

విధ్వంసకర శతకం
తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్‌.. ఆ తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.

ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన వైభవ్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్‌కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.

తద్వారా ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2025లో తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్‌.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా సీజన్‌ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.

18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
👉వైభవ్‌ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు)
👉ఆయుశ్‌ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు)
👉రియాన్‌ పరాగ్‌- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు)
👉సర్ఫరాజ్‌ ఖాన్‌- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు-0)
👉అభిషేక్‌ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు-0).

చదవండి: ఆ యంగ్ క్రికెట‌ర్‌కు నేను హాగ్ ఇవ్వ‌లేదు: ప్రీతి జింటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement