
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.
పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు.
రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్‌లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్‌కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్‌ఎస్‌జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు.