దుబాయ్‌లో ప్రపంచ కబడ్డీ లీగ్‌ | World Super Kabaddi League To Be Held In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ప్రపంచ కబడ్డీ లీగ్‌

Jul 2 2025 10:57 AM | Updated on Jul 2 2025 11:08 AM

World Super Kabaddi League To Be Held In Dubai

న్యూఢిల్లీ: మనదేశంలో విశేషాదరణ చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) త్వరలో విశ్వవ్యాప్తంగా కూత పెట్టేందుకు ముస్తాబైంది. ప్రపంచ సూపర్‌ కబడ్డీ లీగ్‌ (డబ్ల్యూఎస్‌కేఎల్‌)కు వచ్చే ఏడాది నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

ప్రారంభ ప్రపంచ లీగ్‌ దుబాయ్‌లో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్‌) భాగస్వామ్యంతో ఫ్రాంచైజీ లీగ్‌ నిర్వహిస్తామని డబ్ల్యూఎస్‌కేఎల్‌ వర్గాలు తెలిపాయి.

మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో పటిష్టమైన భారత బలగం ప్రధాన భూమిక పోషించనుంది. ‘ఒక్క భారత్‌లోనే కాదు... ప్రపంచస్థాయిలోనే కబడ్డీ క్రీడా ఎంతో ఎదిగింది. అంతర్జాతీయ క్రీడల్లో మన గ్రామీణ ఆట ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పీకేఎల్‌ ద్వారా దేశంలో సంపాదించుకున్న అభిమాన దళాన్ని ఇక మీదట ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకునేందుకు వరల్డ్‌ సూపర్‌ కబడ్డీ లీగ్‌ దోహదం చేస్తుంది.

తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గుర్తింపు కూడా పొందాలన్నదే మా ప్రధాన లక్ష్యం’ అని ఎస్‌జే కబడ్డీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు శాంభవ్‌ జైన్‌ తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే డబ్ల్యూఎస్‌కేఎల్‌ టోర్నీ జరగనుంది. 

అంతర్జాతీయ కబడ్డీలో రాణిస్తున్న దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, మలేసియా, జపాన్, కెనడా, అమెరికా దేశాల కబడ్డీ సమాఖ్యలు ఈ లీగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ. 48 కోట్ల పర్సు కలిగి ఉంటుంది. ముందుగా ఎనిమిది ఫ్రాంచైజీల ఎంపిక అనంతరం పూర్తిస్థాయి వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement