
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్‌లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్‌లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్‌లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు.
టైబ్రేక్‌లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్‌లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్‌ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్‌రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్‌తో వైశాలి తలపడతారు.