మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ గెలుపు జెండా ఎగురవేసింది. చైనీస్ తైపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది.
వరుసగా రెండోసారి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధ భాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజూ దేవి సూపర్ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా.. సారథి రీతూ నేగి ట్యాకిల్‌కు యత్నించి గాయపడింది. ఇక సెకండాఫ్‌లోనూ భారత్ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే, చైనీస్ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు.
సమయం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే, భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా..డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ టైటిల్ సొంతం చేసుకుని సత్తా చాటింది.
గుత్తాధిపత్యం మనదే
కాగా భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇప్పటికి మూడు ప్రపంచకప్ టోర్నీలు జరుగగా.. మూడింట చాంపియన్‌గా నిలిచింది. మహిళా జట్టు సైతం అదే పరంపరను కొనసాగించడం విశేషం. ఇప్పటికి ఓవరాల్‌గా ఐదు ప్రపంచకప్ టోర్నీ (3 పురుష, 2 మహిళలు)లు జరుగగా ఐదింట భారత్‌దే విజయం. కబడ్డీలో మన గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు ఇరుజట్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆఖరి వరకు అజేయంగా
ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలిచింది, గ్రూప్-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్-‘బి’లో చైనీస్ తైపీ సైతం ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచింది.
ఇక సెమీ ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా.. మరో సెమీస్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్‌పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్ చేరగా భారత్- చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి.
ఆసియా నుంచి భారత్, ఇరాన్, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, నేపాల్, థాయ్‌లాండ్ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్.. యూరోప్ నుంచి పోలాండ్, జర్మనీ.. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా పాల్గొన్నాయి.
మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీ-2025లో పాల్గొన్న భారత జట్టు
రీతూ నేగి (కెప్టెన్), పుష్ఫ రాణా (వైస్ కెప్టెన్), సొనాలి షింగాటే, పూజా నర్వాల్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ, పూజా కజ్లా, చంపా ఠాకూర్, రీతూ షోరేన్, రీతూ మిథర్వాల్, సంజూ దేవి, ధనలక్ష్మి, అనూ కుమారి.
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
🚨 THIS IS PRETTY HUGE NEWS FOLKS 💥
WORLD CUP WINNING MOMENTS FOR INDIA 🏆
Indian Women's Team defeated Chinese Taipei 35-28 in the Finals of Kabaddi World Cup 2025!
Our Girls successfully defends the Trophy 🇮🇳💙 pic.twitter.com/rEp45Qu6aW— The Khel India (@TheKhelIndia) November 24, 2025


