
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కాలికి గాయమైంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా పంత్ ఎడమకాలి పాదం ఫ్రాక్చర్ అయింది.
త్వరలోనే రీఎంట్రీ
అయినప్పటికీ కట్టుతోనే బ్యాటింగ్‌కు దిగిన పంత్ అర్ధ శతకం సాధించాడు. అయితే, గాయం తీవ్రం కావడంతో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పునరావాస శిబిరంలో చికిత్స తీసుకున్న పంత్.. త్వరలోనే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
అయితే, పంత్ గైర్హాజరీలో మరో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ టెస్టు జట్టులో వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-ఎ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇక ఇటీవల వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా జురెల్ టెస్టుల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు.
పంత్ తిరిగి వస్తే అతడి పరిస్థితి ఏమిటి?
గత కొన్నాళ్లుగా నిలకడగా పరుగులు సాధిస్తున్న 24 ఏళ్ల జురెల్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే, పంత్ తిరిగి వస్తే అతడి పరిస్థితి ఏమిటన్న సందేహాల నడుమ.. భారత మాజీ క్రికెటర్ సదగోపర్ రమేశ్ (Sadagoppan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ టెస్టులో జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ (125) ఆడాడు. విండీస్ బౌలింగ్ అటాక్ పేలవంగానే ఉన్నా.. జురెల్ ఒత్తిడిలో ఉండటం సహజం.
అచ్చమైన బ్యాటర్‌గా..
ఎందుకంటే బీస్ట్ లాంటి పంత్‌తో అతడికి పోటీ ఉంది. అయితే, ఈ సెంచరీ ద్వారా మేనేజ్‌మెంట్‌కు అతడు ఓ విషయం స్పష్టం చేశాడు. తనకు, పంత్‌కు మధ్య పోటీ లేదని.. అచ్చమైన బ్యాటర్‌గా తాను అందుబాటులో ఉంటానని సంకేతాలు ఇచ్చాడు.
సాయి సుదర్శన్ గనుక మూడో స్థానంలో విఫలమవుతూ ఉన్నా... నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించకపోయినా.. ఈ రెండు సందర్భాల్లో జురెల్‌కు ఢోకా ఉండదు. ఒకవేళ రిషభ్ పంత్ తిరిగి వచ్చినా జురెల్ మూడో నంబర్ ఆటగాడిగా ఫిక్సయిపోవచ్చు’’ అని సదగోపన్ రమేశ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టుల్లో కలిపి 380 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ ఉన్నాయి.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్