గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ చేదు ఫలితమే చవిచూసింది.
30 పరుగుల తేడాతో
కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలో సఫారీలు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటిస్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా కూరుకుపోయింది.
కాగా గంభీర్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన తర్వాత టెస్టుల్లో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లను మాత్రమే ఓడించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లండ్ టూర్‌లో 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది.
జీర్ణించుకోలేకపోతున్నాం
ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్.. కోచ్ గంభీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్ష నిర్ణయాలతో కోచ్‌లను నియమిస్తే ఇలాగే ఉంటుందటూ బీసీసీఐని విమర్శించాడు. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని.. కోచ్‌ల నియామకంలో పారదర్శకత ప్రదర్శిస్తే బాగుండేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.
పెద్దగా బాధపడే వారు కాదు.. కానీ ఈసారి
అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరును కైఫ్ తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు.. ‘‘అవును.. స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడితే కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. గతంలో.. ఆస్ట్రేలియా పర్యటన అంటే ఓటమి ఖరారు అనే భావన ఉండేది. ముందుగానే అభిమానులు కూడా ఫిక్స్ అయ్యే వారు కాబట్టి పెద్దగా బాధపడే వారు కాదు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఓటమిని మరీ ఎక్కువగా మనసుకు తీసుకునేవారు కాదు. కానీ మన సొంతగడ్డపై ఇలా మ్యాచ్‌లు ఓడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సౌతాఫ్రికా మన కోటను బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ గతంలోనే వైట్‌వాష్ చేసింది.
ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు..
కాబట్టి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు అందరికీ గుర్తుకువస్తుంది. అయన లాంటి మరికొందరి పేర్లు కూడా కోచింగ్ పోటీదారుల జాబితాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నిజానికి కోచింగ్ ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తారు.
ఇంటర్వ్యూ ద్వారా కోచ్‌ను సెలక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ.. దరఖాస్తులు ఆహ్వానించినా తమకు నచ్చిన వారి కోసం.. మిగతా వారిని నిర్దద్వంగా తిరస్కరిస్తున్నారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ లేకుండానే కోచ్‌ను ఎంపిక చేస్తున్నారు. అలాంటపుడు ఎవరు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు?
పారదర్శకత లేదు
తమ దరఖాస్తు తిరస్కరణకు గురి అవుతుందని కచ్చితంగా తెలిసిన తర్వాత అవమానపడాలని ఎందుకు అనుకుంటారు?.. అక్కడ పారదర్శకత లేదని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని కైఫ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించాడు.
కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో.. హైదరాబాదీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బ్యాకప్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా పనిచేస్తున్నాడు.
కోచింగ్ పరంగా వీవీఎస్‌కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కైఫ్ ఈ మేరకు అతడు హెడ్‌కోచ్‌గా వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇంతకుముందు ఎలాంటి కోచింగ్ అనుభవం లేకుండానే గంభీర్ నేరుగా టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.


