ఈడెన్ గార్డెన్స్.. భారత క్రికెట్ జట్టుకు కంచుకోట. ఈ ప్రతిష్టాత్మక మైదానంలో టీమిండియాను ఓడించాలంటే ప్రత్యర్ధి జట్టుకు కత్తి మీద సామే. అయితే ఈ ఐకానిక్ గ్రౌండ్‌లో గత 13 ఏళ్లగా ఓటమి ఎరుగుని భారత జట్టును టెంబా బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా కంగు తినిపించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్‌ను ప్రోటీస్ చిత్తు చేసింది.
124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ 93 పరుగుల వద్దే చతికిల పడింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టు తమ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన సమయం అసన్నమైంది.

భారత్‌కు 'డూ ఆర్ డై'
నవంబర్ 22 నుంచి గౌహతిలోని బార్సాపరా స్టేడియం వేదికగా ప్రోటీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ 'డూ ఆర్ డై' మ్యాచ్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.
ఎక్కడైతే ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొలేక భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారో.. అక్కడే ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. భారత జట్టు మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు చమటోడ్చనున్నారు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.
గిల్ దూరం..!
ఇక కీలకమైన రెండో టెస్టుకు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే అవకాశముంది. మెడ నొప్పి కారణంగా తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న గిల్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి నాలుగైదు రోజుల సమయం పట్టనుంది.
దీంతో గౌహతికి టెస్టుకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే అతడి స్ధానంలో సాయి సుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. సుదర్శన్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడి సేవలను మిడిలార్డర్‌లో భారత్ ఉపయెగించుకోనుంది.
వాషింగ్టన్‌పై వేటు..
ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. గౌహతి పిచ్ సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో భారత్ ఆడనున్నట్లు సమాచారం. వాషింగ్టన్ సుందర్‌పై మెనెజ్‌మెంట్ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో అతడు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడాడు.
వాషీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు స్పిన్నర్లగా మెరుగ్గా రాణించారు. ఇప్పుడు సుందర్ స్ధానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్‌ను ఆడించే యోచనలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడంట.
భారత్‌కు బౌలింగ్‌కు పరంగా ప్రస్తుతం ఎటువంటి ఢోకా లేదు. సఫారీలపై మన బ్యాటర్లే సత్తాచాటాల్సి ఉంది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఒకే వికెట్ కీపర్‌తో భారత్ ఆడనునున్నట్లు సమాచారం. ధ్రువ్ జురెల్ స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జైశ్వాల్ ఫామ్ అందుకుంటాడా?
ఇక తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన సమయం అసన్నమైంది. దాదాపుగా ప్రతీ టెస్టులోనూ జైశూ తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌కు అద్భుతమైన శుభారంభం అందిస్తూ ఉంటాడు.
గత మ్యాచ్‌లో అతడు తన బ్యాట్‌కు పని చెప్పకోవడంతో భారత్ ఘోర పరాజయం ఎదుర్కొంది. దీంతో అతడు కీలకమైన గౌహతి టెస్టులో రాణించాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. అతడితో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా రాణించాల్సిన అవసరముంది. ఒకవేళ గిల్ దూరమైతే పంత్‌నే జట్టును నడిపించనున్నాడు.
రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్,ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


