
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కెరీర్‌లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు.
ఇక ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 907 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు.
ఇక ఆసియా కప్ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 248 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 206కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న 25 ఏళ్ల అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వదంతి వ్యాప్తిలోకి వచ్చింది.
ప్రేమలో పడ్డ అభిషేక్ శర్మ?
లైలా ఫైజల్ ( Laila Faisal) అనే అమ్మాయితో అభిషేక్ ప్రేమలో ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. అభిషేక్ అక్క కోమల్ శర్మ డాక్టర్ అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన తమ్ముడి మ్యాచ్ ఉన్న సమయంలో స్టేడియానికి వెళ్లి అతడిని ఉత్సాహపరచడంలో కోమల్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.

ముఖ్యంగా ఐపీఎల్‌లో అభి ప్రాతినిథ్యం వహించే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లన్నింటీకి తల్లి మంజుతో కలిసి కోమల్ హాజరవుతుంది. ఇక వీరితో పాటు లైలా కూడా చాలాసార్లు కెమెరా కంటికి చిక్కింది. నిజానికి లైలా కోమల్ బెస్ట్ ఫ్రెండ్ అని వారి సోషల్ మీడియా అకౌంట్లలోని పోస్టుల ద్వారా తెలుస్తోంది.
ఇటీవల కోమల్ బ్యాచిలరెట్ పార్టీలోనూ లైలా హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆసియా కప్ ఆడేందుకు అభిషేక్ యూఏఈ వెళ్లగా.. అతడి తల్లి మంజు, అక్క కోమల్ కూడా అక్కడే ఉన్నారు. వీరితో పాటు లైలా కూడా వెళ్లినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
ఎవరీ లైలా ఫైజల్?
LRF అనే లగ్జరీ దుస్తుల బ్రాండ్ సహ వ్యవస్థాపకురాలు. తల్లి రూహీ ఫైజల్‌తో కలిసి లైలా దీనిని ప్రారంభించింది. కశ్మీర్ సిల్క్స్‌తో పాటు చేనేత వస్త్రాలకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి. ఇప్పుడిప్పుడే భారత ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న లైలా పేరు అభిషేక్‌తో ముడిపడటంతో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది.

కాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే ముందు లైలా లండన్‌లో సైకాలజీ చదివినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడే ఫ్యాషన్ టెక్నాలజీలోనూ కోర్సు చేసినట్లు తెలుస్తోంది. మలన్ బ్రెటాన్, రాకీ స్టార్ వంటి ప్రఖ్యాత డిజైనర్లతో కలిసి పనిచేసిన లైలా.. తర్వాత తనకంటూ సొంత బ్రాండ్‌ను స్థాపించింది.
చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్