
‘శత’క్కొట్టిన కేసీ కార్టీ
16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మాథ్యూ ఫోర్డీ
విండీస్ 352/8
వర్షంతో సాధ్యపడని ఐర్లాండ్ ఇన్నింగ్స్
డబ్లిన్: ఐర్లాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్ రెండో వన్డేలో అదరగొట్టింది. భారీ స్కోరు చేసి విజయంపై ఆశలు పెంచుకున్న వెస్టిండీస్‌ను వరుణదేవుడు కరుణించలేదు. ఫలితంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిశాక భారీ వర్షం రావడంతో ఐర్లాండ్ ఛేజింగ్ సాధ్యపడలేదు. వెరసి మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది.
వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేయగా... చివర్లో మాథ్యూ ఫోర్డీ (19 బంతుల్లో 58; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) శివమెత్తాడు. కేవలం 16 బంతుల్లోనే ఫోర్డీ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఏబీ డివిలియర్స్ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును ఫోర్డీ సమం చేశాడు.
కెప్టెన్ షై హోప్ (57 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకోగా... జస్టిన్ గ్రీవెస్ (36 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ, జోష్ లిటిల్ రెండు వికెట్ల చొప్పున తీయగా... లియామ్ మెకార్తీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.