ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. రెండో టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు రాంచీలో అద్భుత విజయం సాధించిన విండీస్ కూడా తమ జోరును కొనసాగించాలని భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌లో సైతం భారత బౌలర్లకు కరేబియన్ బ్యాటర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్‌లకు పేరుగాంచిన ఇండోర్ మైదానంలో బౌలర్లు చిన్న తప్పు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాకుండా విండీస్ ఈ మ్యాచ్‌లో తమ తురుపు ముక్క అమీర్ జంగూను బరిలోకి దించినట్లు తెలుస్తోంది.
పూరన్‌పై వేటు.. జంగూకు చోటు
తొలి రెండు టీ20ల్లో విఫలమైన యువ ఓపెనర్ కామిల్ పూరన్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో అమీర్ జంగూకు తుది జట్టులో కల్పించనున్నట్లు సమాచారం. వాస్తవానికి తొలుత ఎంపిక చేసిన జట్టులో జంగూ పేరు లేదు. కానీ టీ20 సిరీస్‌కు ముందు జ్యువెల్ ఆండ్రూ గాయపడడంతో జంగూకు సెలక్టర్లు పిలుపిచ్చారు.
అంతకుముందు టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో జంగూ దుమ్ములేపాడు. ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 119.50 సగటుతో, 135.80 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 239 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి టీ20 జట్టులో చోటు ఇచ్చారు. ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అతడు ఎంట్రీ ఇస్తే భారత బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
విండీస్ తుది జట్టు(అంచనా): షాయ్ హోప్ (కెప్టెన్), జంగూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, షమర్ స్ప్రింగర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్


