
ధావన్- ఆఫ్రిది (PC: X)
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)- 2025 సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న పాకిస్తాన్ చాంపియన్స్‌తో పాటు సౌతాఫ్రికా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ ముందుగానే టాప్-4లో అడుగుపెట్టాయి.
తాజాగా వెస్టిండీస్ చాంపియన్స్‌ను ఓడించి.. మెరుగైన నెట్‌రన్‌రేటు సాధించిన ఇండియా చాంపియన్స్ (India Champions) కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో తొలి సెమీ ఫైనల్లో టాపర్ పాకిస్తాన్‌ను ఇండియా ఢీకొట్టనుండగా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా తలపడతాయి.
బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇండియా వర్సెస్ పాక్ (Ind vs Pak), రాత్రి తొమ్మిది గంటలకు సౌతాఫ్రికా- ఆసీస్ (SA vs AUS) మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గ్రూప్ దశలోనే దాయాది పాక్‌తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.
సెమీస్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్
అయితే, తాజాగా సెమీస్‌లోనూ చిరకాల ప్రత్యర్థితో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ పోటీపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి తప్పుకొంటే.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో డబ్ల్యూసీఎల్ టాప్ స్పాన్సర్ ఈజ్‌మైట్రిప్ మాత్రం భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ పోరు నుంచి తప్పుకొంది. ఈ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.
మాకు దేశమే ముఖ్యం
‘‘డబ్ల్యూసీఎల్ సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది.
అయితే, పాకిస్తాన్‌తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు అండగా ఉండలేము.
కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
చదవండి: బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. ఇండియా సెమీస్‌లో చేరిందిలా!