
యువీ- గేల్ (PC: X)
ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్ (WCL 2025)లో టీమిండియాకు ఇది తొలి విజయమే అయినా.. ఏకంగా టాప్-4కు అర్హత సాధించడం విశేషం.
వరుస ఓటములు
ఈ టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది ఇండియా. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్‌తో తలపడి 88 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఇంగ్లండ్ చాంపియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న యువరాజ్ సేన.. విండీస్‌తో తాజా మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది.
చెలరేగిన భారత బౌలర్లు
గ్రేస్ రోడ్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇండియా.. వెస్టిండీస్‌ను 144 పరుగులకు కట్టడి చేసింది. ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (2), కెప్టెన్ క్రిస్ గేల్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
మిగతా వారిలో డ్వేన్ స్మిత్ (20) కాస్త ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ వింటేజ్ ఆటను గుర్తుచేశాడు. కేవలం 43 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు కూల్చారు. పవన్ నేగి ఒక వికెట్ దక్కించుకున్నాడు.
14 ఓవర్లలోనే ఛేదించాలి
అయితే, సెమీస్ సమీకరణల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 14 ఓవర్లలోనే ఛేదించాలి. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్‌రేటుతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ అద్భుతమే చేసింది. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది.
బిన్ని మెరుపు అర్ధ శతకం
స్టువర్ట్ బిన్ని మెరుపు అర్ధ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21)తో పాటు యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు.
Mountains are there to be climbed 💪
Faced with a stiff target of 145 in 14.1 overs to qualify for the semis, India got there with ease thanks to fireworks from Stuart Binny & Yusuf Pathan 🇮🇳#WCL2025 pic.twitter.com/eGOorYFQbq— FanCode (@FanCode) July 29, 2025
మిగతా వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (18 బంతుల్లో 25) రాణించగా.. రాబిన్ ఊతప్ప (8), గురుకీరత్ సింగ్‌మాన్ (7), సురేశ్ రైనా (7) విఫలమయ్యారు. ఇక 13.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన ఇండియా చాంపియన్స్ ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది.
పాక్‌తో సెమీస్... ఇండియా ఆడుతుందా?
ఆరుజట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, సౌతాఫ్రికా చాంపియన్స్ ఐదింట చెరో నాలుగు గెలిచి ముందుగానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట రెండు, ఇండియా చాంపియన్స్ (రన్‌రేటు: -0.558) ఒకటి గెలిచి టాప్-4లో నిలిచాయి.
ఇంగ్లండ్ ఐదింట ఒకటి (రన్‌రేటు: -0.809), వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట ఒకటి (రన్‌రేటు: -2.302) మాత్రమే గెలిచి.. నెట్ రన్‌రేటు పరంగానూ వెనుకబడి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇండియా ఆడుతుందా? లేదంటే టోర్నీ నుంచే తప్పుకొంటుందా? అనేది తేలాల్సి ఉంది.
చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’